చంద్రబాబు చిల్లర వ్యవహారం: శోభా నాగిరెడ్డి

హైదరాబాద్, 23 సెప్టెంబర్ 2013:

రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు సిఎంగా పనిచేసిన నాయకుడు ఈ చంద్రబాబు నాయుడేనా అనే అనుమానంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ ఉప నాయకురాలు శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రపతికి లేఖ ఇచ్చిన మహిళల గురించి కూడా నీచంగా వ్యాఖ్యానించే దుస్థితికి చంద్రబాబు దిగజారిపోయారని విమర్శించారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు ఎన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా, ఎన్ని బస్సు యాత్రలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ రానివ్వకుండా అడ్డుకునేందుకు ఢిల్లీలో కుట్రలు చేస్తున్నారని శోభా నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్క జగన్మోహన్‌రెడ్డిని దృష్టిలో పెట్టుకుని హుందాతనాన్ని వదిలేసి చిల్లరగా వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తిపోశారు. హుందాగా వ్యవహరిస్తే.. కొంతయినా ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందని చంద్రబాబుకు శోభా నాగిరెడ్డి హితవు పలికారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో సోమవారం మధ్యాహ్నం ఆమె కాసేపు మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి ప్రజల గొంతు ఏమాత్రం వినిపించారో స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని భూమా శోభా నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పారా? లేక తెలంగాణకు అనుకూలంగా తాను ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నానని, రాష్ట్రాన్ని విభజించండి అని చెప్పివచ్చారా వెల్లడించాలన్నారు. ఇరు ప్రాంతాల టిడిపి నాయకులను ఢిల్లీ తీసుకువెళ్ళి ఏం చెప్పారు చంద్రబాబూ అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు.

సీమాంధ్రలోని సుమారు 6 కోట్ల మంది ప్రజలు అన్నింటినీ వదిలేసుకుని దీక్షలు, ధర్నాలు చేస్తుంటే.. భవిష్యత్తు అంధకారంగా మారిపోయిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు తమ జీతాలను కూడా వదులుకుని ఆందోళనలు చేస్తుంటే.. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్రానికి వివరించడానికి వెళ్ళానని చెప్పడంలో ఔచిత్యం ఏముందని అన్నారు. రాష్ట్రపతితో సమావేశానికి అనుమతి కోరుతూ చంద్రబాబు పంపించిన లేఖలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి కేసుల విషయంలో మాట్లాడడానికి అపాయింట్‌ కోరుతూ రాసిన వైనాన్ని ఆమె ప్రస్తావించారు. ఇలా ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్న చంద్రబాబు ఎవరిని మోసం చేయడానికి ఢిల్లీ యాత్రకు వెళ్ళారని శోభా నాగిరెడ్డి నిలదీశారు.

ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తారట.. గడచిన 55 రోజులుగా సీమాంధ్ర ప్రజలు, జెఎసిలు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్న సమయంలో ఆయన కేవలం తన రాజకీయ లబ్ధి కోసమే ఢిల్లీ వెళ్ళారని ఆరోపించారు. ఒక పక్కన శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ రాకుండా అడ్డుకునేందుకే రాష్ట్రపతిని కలుస్తానంటూ అపాయింట్‌ కోసం రాసిన లేఖలో తెలిపారని, మరో పక్కన రాహుల్‌గాంధీ దూతను కలిశారని శోభా నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. సీమాంధ్రుల అభిప్రాయాలు, వారికి ఎదురయ్యే నష్టాల గురించి మాట్లాడకుండా.. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేని చంద్రబాబు భయంతోనే ఇరు ప్రాంతాల నాయకులను మీడియా కవరేజి కోసమే ఢిల్లీ వెళ్ళారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు దిగజారిపోయి మరీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో క్విడ్ ప్రో‌ కో జరగలేదని తాము మొదట నుంచీ చెబుతూనే ఉన్నామని మీడియా అడిగిన ప్రశ్నికు శోభా నాగిరెడ్డి జవాబిచ్చారు. సిబిఐ కూడా ఇప్పుడదే తేల్చిందని ఆమె అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top