నేడు, రేపు హైదరాబాద్‌లో విజయమ్మ ‘ఫీజు దీక్ష'

హైదరాబాద్, 18 జూలై 2013:

లక్షలాది మంది విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసే క్రమంలో ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నందుకు నిరసనగా వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ గౌర‌వ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ గురు, శుక్రవారాల్లో 'ఫీజు దీక్ష' చేస్తున్నారు. ‘పెద్ద చదువులు... పేదోళ్లందరి హక్కు..!’ అనే నినాదంతో ఆమె నిరాహార దీక్ష చేస్తున్నారు. గురువారం ఉదయం ఆమె హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఈ దీక్ష చేస్తారు.

డబ్బుకు పేదోళ్లయినా, విద్యకు పేదోళ్లు కారాదనే మహదాశయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ‘ఫీజు రీయింబర్సుమెంట్’ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్, మెడిసిన్ సహా ఉన్నత, వృత్తి విద్యా కోర్సుల‌కు అయ్యే ఫీజులను ప్రభుత్వమే చెల్లించి, పేద విద్యార్థుల జీవితాలకు వెలుగునిచ్చేలా పథకాన్ని రూపొందించారు. కానీ, ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ‘ఫీజు రీయింబర్సుమెంట్’కు తూట్లు పొడుస్తున్నాయి. రకరకాల ఆంక్షలు విధించి, పేదల విద్యార్థులకు ఉన్నత విద్యను అందకుండా చేస్తున్నాయి.

ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల ఫీజులను ఇటీవల తానే పెంచిన ప్రభుత్వం... రీయింబర్సుమెంటుకు మాత్రం అనేక పరిమితులు విధించింది. ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజు ఎంత ఉన్నా ‌ప్రభుత్వం చెల్లించేది రూ. 35 వేలేనని జిఓ ఇచ్చింది. ఆ బృహత్తర పథకాన్ని ఈ ప్రభుత్వం అలా నిర్వీర్యం చేస్తోంటే... విద్యార్థులను జాగృతం చేసి, ఆ పథకాన్ని పరిరక్షించుకునేందుకు శ్రీమతి విజయమ్మ ఫీజు దీక్ష చేస్తున్నారు.

‘ఫీజు రీయింబర్సుమెంట్’ పథకం పరిరక్షణ కోసం 2011లో ఫిబ్రవరి 18 నుంచి 24వ తేదీ వరకు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ఇదే ఇందిరాపార్కు వద్ద వారం రోజులు నిరాహార దీక్ష చేశారు. ఆ తరువాత ఈ పథకం పరిరక్షణ కోసం 2012 జనవరి 4న రాష్ట్రవ్యాప్తంగా ఒక రోజు ధర్నాలు చేశారు. ఒంగోలులో ‌శ్రీ జగన్ స్వయంగా ధర్నాలో పాల్గొన్నారు. ఇదే అంశంపై 2012 ఆగస్టు 13, 14 తేదీల్లో శ్రీమతి విజయమ్మ పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో దీక్ష చేశారు. 2012 సెప్టెంబర్ 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద కూడా ఆమె దీక్ష చేశారు. అయినా.. పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూండడంతో శ్రీమతి విజయమ్మ మూడవసారి ఫీజు దీక్ష చేస్తున్నారు.

మైనారిటీలకు వరం: రెహ్మాన్ :
ఫీజు రీయింబర్సుమెంట్ పథకం వల్ల ఎక్కువగా మేలు జరిగేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు వర్గాల విద్యార్థులకే అని.. అందులోనూ మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరమని పార్టీ మైనారిటీల రాష్ట్ర విభాగం కన్వీనర్ హెచ్‌ఎ రెహ్మా‌న్ అన్నారు. శ్రీమతి విజయమ్మ దీక్షకు మైనారిటీలు భారీ సంఖ్యలో హాజరై సంఘీభావం ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు.

Back to Top