'టీ' బిల్లుపై ఓటింగ్ పెట్టనందుకే వాకౌట్

హైదరాబాద్:

'ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు -2013'పై అసెంబ్లీలో ఓటింగ్ ‌జరిపిన తర్వాత మాత్రమే చర్చ నిర్వహించాలన్న తమ ప్రతిపాదనను‌ శాసనసభ స్పీకర్ అంగీకరించకపోవటంతో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శుక్రవారం సభ నుంచి వాకౌ‌ట్ చేసింది. ‌శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభ ప్రారంభం కాగానే వైయస్ఆర్‌సీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్ళి, తమ ప్రతిపాదనను అంగీకరించాలని స్పీకర్ నాదెండ్ల మనోహ‌ర్‌ను కోరారు. ఈ సందర్భంగా ‘‌వియ్‌ వాంట్ ఓటింగ్’ అంటూ వారు చేసిన నినాదాలతో సభ దద్దరిల్లింది. వైయస్ఆర్‌సీపీ సభ్యుల డిమాండ్‌ను స్పీకర్ తిరస్కరించి, చర్చలో పాల్గొనా‌లని సూచించారు. అయితే చర్చించటమంటే విభజనకు అంగీకరించినట్టే అవుతుందని పార్టీ సభ్యులు స్పష్టం చేశారు. అందుకే ముందుగా ఓటింగ్ ‌నిర్వహించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

‌వైయస్ఆర్‌సీపీ సభ్యులు తమ ఆందోళనను విమరించకపోవడంతో సభను స్పీకర్ అ‌ర్ధగంట పాటు వాయిదా వేశారు. పదిన్నరకు తిరిగి సభ ప్రారంభమవగానే వైయస్ఆర్‌సీపీ సభ్యులు మళ్లీ పోడియం వద్దకు చేరి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బీఏసీ నిర్ణయాల మేరకే సభ జరుగుతోందని, సభ్యులు కూర్చుంటే వారి శాసనసభా పక్ష నేత శ్రీమతి విజయమ్మకు మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పారు. దాంతో వారు తమ సీట్లలో కూర్చున్నారు.

‌తరువాత శ్రీమతి విజయమ్మ మాట్లాడారు. బిల్లుపై సభలో చర్చకు తీసుకువచ్చే క్రమంలో రాజ్యాంగ విధానాలను అసలే పాటించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయే అంశాలను విస్మరించారో వరసగా పేర్కొన్నారు. వాటన్నింటికీ నిరసనగా తాము వాకౌట్‌ చేస్తున్నట్టు ప్రకటించారు.

తమ వాకౌట్‌కు కారణమైన ఒక్కో అంశాన్నీ శ్రీమతి విజయమ్మ ఈ సందర్భంగా సభలో ఏకరువు పెట్టారు.
‘నిన్న మేం సభలో లేవనెత్తిన అంశాలకు, ఓటింగ్ ప్రతిపాదనకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. అందుకని వాకౌ‌ట్ చేస్తున్నాం. అత్యధిక మంది ప్రజలు, నాయకులు కోరుకుంటున్న సమైక్యాంధ్రప్రదే‌శ్‌ను విభజించేందుకు సిద్ధమైనందున వాకౌట్ చేస్తున్నాం. ఆర్టికల్ 3 ప్రకారం సంబంధిత రాష్ట్రం విభజనకు తీర్మానం చేయాలన్న మా ప్రతిపాదనను పట్టించుకోనందుకు వాకౌ‌ట్ చేస్తున్నాం. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీ‌స్‌గఢ్ మాదిరిగా ఆర్టికల్ 3 ప్రకారం విభజన చేయడంలేదు ‌కనుక ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోనందుకు, రాజ్యాంగ సంప్రదాయాలను, సమాఖ్య స్ఫూర్తిని పట్టించుకోనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం. సర్కారియా, పూంచ్ వంటి కమిషన్ల సిఫార్సులను పట్టించుకోనందుకు వాకౌ‌ట్ చేస్తున్నాం‌'.
'రెండవ ఎస్సార్సీ, సంబంధిత రాష్ట్ర తీర్మానం ఉంటాయని 2001 ఆగస్టులో నాటి కేంద్ర హోంమంత్రి చెప్పిన విషయాన్ని,‌ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆధ్వర్యంలో జరిగిన భోపా‌ల్ ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ల సమావేశంలో నిర్ణయించినట్టుగా రెండవ ఎస్సార్సీ ఏర్పాటును, నాడు మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదించి రెండవ ఎస్సార్సీ ఏర్పాటు తదితర విషయాలను విస్మరించినందుకు వాకౌట్ చేస్తున్నాం. 371డి అధికరణ లక్ష్యాలు నెరవేరకుండా చేసినందుకు నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఉద్దేశాలు, కారణాలు చెప్పకుండా, అనేక ప్రధానాంశాలపై సమాచారం ఇవ్వకుండా ముసాయిదా బిల్లు పెట్టినందుకు వాకౌట్ చేస్తున్నాం. శాసనమండలి, అసెంబ్లీల అభిప్రాయాలకు, సీనియ‌ర్ సభ్యుల అభిప్రాయాలకు ఎలాంటి గౌరవం లేకుండా, ఓటింగ్, సమైక్య తీర్మానం పెట్టకుండా చేసినందుకు వాకౌ‌ట్ చేస్తున్నాం‌'.

'అన్నింటికీ మించి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల దుష్ట పరిపాలనకు, రెండు ప్రాంతాల్లో సీట్లు రావన్న ఉద్దేశంతో సెంటిమెంట్లు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే ప్రయత్నానికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం. విభజనకు ఎవరు అనుకూలం, ఎవరు ప్రతికూల‌ం అనేది తేల్చాల్సింది అసెంబ్లీనే. కానీ సభలో ఓటింగ్ ఉండదని దిగ్విజ‌య్‌సింగ్ నిన్న (గురువారం) చెప్పారు. అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించాలని నిన్న (గురువారం) నేను కోరినప్పుడు ఓటింగ్ ఉండదంటూ ఆ ప్రాంత నాయకులు వెంటనే నినాదాలు చేశారు. ఈ తీరుపై మా పార్టీలో అనుమానాలు, భయాలున్నాయి'.
'ముఖ్యమంత్రి‌ ఈ రోజు ఏమైనా హామీ ఇవ్వగలుగుతారా అని అడుగుతున్నాను. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మొదటి నుంచీ కూడా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ పోరాటం చేస్తోంది. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు సహకరించాలని మా పార్టీ అధ్యక్షుడు వై‌యస్ జగన్మోహన్‌రెడ్డి దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులనూ కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లుకు సంబంధించి అన్ని క్లాజులను వ్యతిరేకిస్తూ సవరణలను కూడా మేం అందజేస్తున్నాం. రాష్ట్రం సమైక్యంగా ఉండి, అభివృద్ధి పథంలో నడవాలనేదే మా పార్టీ లక్ష్యం. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు కృషి చేయాలని నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తూ వాకౌట్ చేస్తున్నాం.’

స్వార్థ ఆలోచన‌లో పాలు పంచుకోలేకే వాకౌట్‌ :
రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా రెండు ముక్కలుగా చీల్చాలన్న స్వార్థ రాజకీయ నాయకుల ఆలోచనలో భాగస్వామలు కావడం ఇష్టంలేక అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశామని వై‌యస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ తెలిపింది. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా విభజన జరిగితే భవిష్యత్తులో తెలుగువారికి తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. విభజన బిల్లు నష్టాలను తెలిపే అవకాశం ఇవ్వనందుకే వాకౌట్ చేసినట్లు పేర్కొంది. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, కాటసాని రామిరెడ్డి, గొల్ల బాబూరావు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, బాలరాజుతో కలిసి భూమన కరుణాకరరెడ్డి విలేకరులతో మాట్లాడారు.

Back to Top