రెండవ రోజుకు విజయమ్మ 'సమర దీక్ష'

గుంటూరు, 20 ఆగస్టు 2013:

అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తూ కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిరంకుశ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ గుంటూరులో ప్రారంభించిన 'సమర దీక్ష' మంగళవారం రెండవ రోజుకు చేరింది. శ్రీమతి విజయమ్మ దీక్షా ప్రాంగణానికి సమైక్యవాదులు రెండవ రోజున మరింతగా పోటెత్తారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధురాళ్ళు పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరై శ్రీమతి విజయమ్మకు మద్దతు ప్రకటించారు. దీక్షా ప్రాంగణం ఉన్న గుంటూరు బస్‌స్టాండ్‌ పరిసరాలు జనసంద్రంగా మారాయి. జై జగన్‌, జై సమైక్యాంధ్ర నినాదాలతో అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజలు హోరెత్తించారు.

శ్రీమతి విజయమ్మ దీక్షకు మద్దతుగా రాష్ట్రం నలు మూలల్లోని ఊరూవాడా సంఘీభావం ప్రకటిస్తోంది. అనేక ప్రాంతాల్లో ఆమెకు మద్దతుగా ఆమరణ, రిలే నిరాహార దీక్షలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీమతి విజయమ్మ దీక్షకు సంఘీభావంగా నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆమరణ దీక్ష రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు. తిరుపతిలో వైయస్ఆర్ కాంగ్రె‌స్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి దీక్ష చే‌స్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహనరెడ్డి కర్నూలులో ఆమరణ దీక్ష ప్రారంభించారు. రాజమండ్రిలో దీక్షా శిబిరాన్ని వైయస్ఆర్‌ కాంగ్రెస్ ‌పార్టీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ నాని మంగళవారం నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నారు. రెండవ రోజున శ్రీమతి విజయమ్మ దీక్షా వేదిక నుంచి శాసనమండలి మాజీ సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రె‌స్ సీనియ‌ర్ నాయకుడు దాడి వీరభద్రరావు కాంగ్రె‌స్, ‌టిడిపిలపైన నిప్పులు చెరిగారు.

Back to Top