సమన్యాయం జరిగే వరకూ 'సమరదీక్ష'

గుంటూరు, 22 ఆగస్టు 2013:

ప్రజల ఆకాంక్షలు, కోరికలను మన్నించని ప్రభుత్వాలేవీ నిలబడబోవని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ హెచ్చరించారు. ప్రజల మన్నన లేకపోతే మనలేవన్నారు. అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయాలంటూ గుంటూరులో ఆమె చేస్తున్న ఆమరణ సమరదీక్ష గురువారానికి నాలుగవ రోజుకు చేరింది. గురువారం ఉదయమే గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం శ్రీమతి విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ.. తన ఆరోగ్యం బాగానే ఉందని... సమన్యాయం జరిగే వరకూ సమరదీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

ఆనాడే టిడిపి ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని శ్రీమతి విజయమ్మ అన్నారు. కాంగ్రెస్, టిడిపి ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసి ఉంటే సిడబ్ల్యుసి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదని  ఆమె అభిప్రాయపడ్డారు. దొంగ నాటకాలు ఆడేది కాంగ్రెస్ పార్టీయే‌ అన్నారు. న్యాయం చేయలేకపోతే విభజన చేయకూడదని శ్రీమతి విజయమ్మ డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ అంతా ఉప్పునీరే ఉందని, శ్రీశైలం నీటిని ఎలా ఇస్తారు, నాగార్జునసాగర్‌ నీరు ఏ విధంగా ఇస్తారో వివరించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. నారాయణపూర్, ఆల్మట్టి నిండితేనే కాని మన రాష్ట్రానికి నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ పరిస్థితుల్లో మధ్యలో తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటైతే కింద ఉన్న ప్రాంతానికి ఏమి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. కృష్ణా డెల్టాకు నీళ్ళు రాకపోతే ఆ ప్రాంత ప్రజలు ఎలా బ్రతుకుతారని నిలదీశారు.

‌రాష్ట్ర ఆదాయంలో 45 నుంచి 50 శాతం నిధులు ఒక్క హైదరాబాద్‌ నుంచే వస్తాయన్నారు. విడిపోతామనే వా‌రికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఇస్తామంటున్నారని శ్రీమతి విజయమ్మ వ్యాఖ్యానించారు. అప్పుడు సీమాంధ్ర ప్రజలు ఎలా బ్రతకాలని, ప్రజల సంక్షేమ పథకాల సంగతేం కావాలని ఆమె ప్రశ్నించారు. వీటన్నింటికీ కేంద్రం జవాబు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో మద్రాసు నుంచి ఆంధ్రులను దూరం చేశారని, 60 ఏళ్ళుగా అందరం కష్టపడి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్‌ నుంచి కూడా వెళ్ళిపొమ్మంటున్నారని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ఇదెలా సమంజసం అవుతుందన్నారు. సీమాంధ్రలో బొగ్గు నిక్షేపాలు లేవని, గ్యాస్‌ ఉన్నా మన అవసరాలకు సరిపడిన మేరకు కేటాయించడంలేదన్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగులకు భద్రత ఏమిటి? వీటన్నింటి విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

అసెంబ్లీ తీర్మానం లేకుండానే తెలంగాణ ఇస్తామంటున్న దిగ్విజయ్‌సింగ్‌ మాటలను శ్రీమతి విజయమ్మ తీవ్రంగా ఖండించారు. తాను సిఎంగా ఉన్నప్పుడు మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానం చేసిన తరువాతే కదా ఆ రాష్ట్రాన్ని విభజించారని గుర్తుచేశారు. బిజెపి మూడు రాష్ట్రాలు ఇచ్చినా అసెంబ్లీ తీర్మానం అయ్యాకే ఇచ్చిందన్నారు.

రాష్ట్ర విభజనకు బీజం వేసింది చంద్రబాబు నాయుడే అని అని విమర్శించారు. రాష్ట్రం విడిపోతే జరిగే నష్టం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే సిడబ్ల్యుసి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పరిస్థితి వస్తుందన్నారు.

విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ రెండు కాళ్ళ సిద్ధాంతాన్ని, టిడిపి రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పాటిస్తున్నాయని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖకు కట్టుబడతానంటూనే చంద్రబాబు నాయుడు సీమాంధ్రలోని కొందరు టిడిపి ప్రజాప్రతినిధులతో ఎందుకు నిరాహార దీక్షలు చేయిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ విభజనకే చంద్రబాబు కట్టుబడి ఉండవచ్చు కదా అన్నారు.

దొంగ నాటకాలు ఆడుతున్నదంటూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ వారే నిజానికి దొంగ నాటకాలు ఆడుతున్నారని శ్రీమతి విజయమ్మ నిప్పులు చెరిగారు. తెలంగాణ విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని సోనియా చెప్పినప్పుడు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసి వచ్చి ఉండాల్సిందన్నారు. ఇందిరా కాంగ్రెస్‌ అని కొత్త పార్టీ పెడతారట. ఓట్లు కావాలంటూ మళ్ళీ ప్రజల్లో తిరుగుతారట అంటూ ఆమె కాంగ్రెస్‌ నాయకులను ఎద్దేవా చేశారు. మరో కొత్త నాటకానికి కాంగ్రెస్‌ సమాయత్తమవుతోందన్నారు. ఇతరులను రాజీనామా చేయాలంటున్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ముందు వారు రాజీనామా చేసి ఇతరులకు చెప్పాలని ఆమె సూచించారు.

ప్రజల కోసం చేస్తున్న సమరదీక్ష ఉద్యమం సందర్భంగా ప్రజలెవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని శ్రీమతి విజయమ్మ ఈ సందర్భంగా విజ్ఞప్తిచేశారు. మరణించి సాధించేదేమీ లేదని అన్నారు. శాంతియుతంగా ఉద్యమం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఎన్జీవోల భద్రతను చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి ఆందోళనా చెందవద్దని అన్నారు.

సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచండని, న్యాయం చేయకపోతే విభజించే అధికారంగాని, హక్కు గాని కాంగ్రెస్‌కు లేదని శ్రీమతి విజయమ్మ స్పష్టంగా పేర్కొన్నారు. మూడు ప్రాంతాలకూ సమన్యాయం ఉండాలనే మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కోరుకునేవారని, ఆ దృష్టితోనే సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థంగా అమలు చేశారని గుర్తుచేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్యాయాన్నే కోరుకుంటోందన్నారు. అందరూ కలిసిమెలిసి ఉండాలని మహానేత కోరుకున్నారని, జగన్‌బాబు కూడా అదే విధంగా భావిస్తున్నారన్నారు. విభజన తప్పనిసరి అయితే.. ఒక తండ్రి లాగా అందరికీ న్యాయం చేయాలన్నారు.

Back to Top