ప్రజలను పీడించడమే స్వర్ణాంధ్ర అవుతుందా?

అనంతపురం:

‘మోసంలో పుట్టి.. మోసంలో పెరిగి.. మోసంతోనే జీవిస్తున్న నయవంచకుడు చంద్రబాబే. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందు దేశంలో‌ని ఐటీ రంగంలో హైదరాబాద్ మూడో స్థానంలో ఉండేది. ఆయన సీఎం అయ్యాక ఐదో స్థానానికి దిగజారింది. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేసినట్లు ఆయన పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు నిక్కరు వేసుకునే నాటికే దేశంలో అభివృద్ధి చెందిన నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఐదో స్థానానికి దిగజారిన మాట వాస్తవం కాదా? ‌అరని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నిలదీశారు. అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, గుత్తి, పామిడిలలో బుధవారం ఆమె రోడ్‌షోలు నిర్వహించి బహిరంగసభల్లో మాట్లాడారు.

హైదరాబాద్‌లో ఓ హైటెక్ సిటీ, రెండు ఫ్లై ఓవర్లు నిర్మించి.. రాష్ట్ర ప్రజలపై రూ.54 వేల కోట్ల రుణభారాన్ని మోపింది నీవు కాదా చంద్రబాబూ? అని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల పాలనలో ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను పీడించింది మరచిపోయావా? మె‌స్‌ చార్జీలు పెంచాలని అడిగిన బీసీ విద్యార్థులను లాఠీలతో చావ బాదించింది నీవు కాదా? విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా బషీ‌ర్‌బాగ్‌లో ఉద్యమించిన రైతులను పిట్టల్లా కాల్చి చంపిన నరరూప రాక్షసుడు నీవే కదా? ఇదేనా స్వర్ణాంధ్ర అంటే..? అంటూ శ్రీమతి విజయమ్మ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

చంద్రబాబు లేఖతోనే విభజన :

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను ప్రేమించిన మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి. ప్రాంతాలకు, రాజకీయాలకు, కుల,‌ మతాలకు అతీతంగా సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేశారు కాబట్టే ఆయనను తెలుగు జాతి అభిమానించింది. వైయస్ మరణించిన నాలుగు నెలలకే తెలుగు జాతిని రెండు ముక్కలు చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ కుట్ర పన్నాయి. అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన లేఖ ఆధారంగానే తెలుగు జాతిని రెండు ముక్కలు చేశారు. ఇది వాస్తవం కాదా.. చంద్రబాబూ?‌ అని ప్రశ్నించారు.  ప్రజాధనాన్ని లూటీ చేయడంలో చంద్రబాబును మించిన రాజకీయ నేత దేశంలో ఎవరూ లేరని దుయ్యబట్టారు.

బాబు, కిరణ్.. దొందూ దొందే :
ప్రజలను పీడించడంలో చంద్రబాబు.. కిరణ్‌కుమార్‌రెడ్డి పోటాపోటీగా తలపడ్డారన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్లలో ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచితే.. కిర‌ణ్ మూడున్నరేళ్లలో నాలుగుసార్లు పెంచారు. స‌ర్‌చార్జీల పేరుతో ప్రజలపై రూ.32 వేల కోట్ల భారాన్ని మోపిన ఘనుడు కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

జగన్‌బాబుతోనే వైయస్ఆర్‌ సువర్ణయుగం :
పది మంది కోసం బతకడం మహానే వైయస్ఆర్ నైజం.. అందరికీ మంచి చేయడం ‌ఆయన విధానం. మహానేత విధానానికి జగన్‌బాబు కట్టుబడ్డారు. అనంతపురం జిల్లా ఆడబిడ్డగా.. మహానేత భార్యగా ఒక్కటే హామీ ఇస్తున్నా.. జగన్‌బాబు వైయస్ అడుగుజాడల్లో నడుస్తారు.. వై‌యస్ చేపట్టిన ప్రతి పథకాన్నీ అమలు చేస్తారు.. జగ‌న్‌బాబును సీఎం చేయండి.. వైయస్ సువర్ణయుగం తెస్తా‌రని హామీ ఇచ్చారు.

ప్రజల కష్టాలు తీరుస్తానని ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి.. తన స్వార్థం కోసం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ప్రజల్లోకి వస్తారు? అని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు.

Back to Top