రైతులంటే కాంగ్రెస్‌కు పగ, చిన్నచూపు

చోడవరం (విశాఖ జిల్లా),

29 జూన్ 2013: ‌రైతులంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పగా, చిన్నచూపా అని శ్రీమతి షర్మిల నిలదీశారు. నిజానికి ఈ నాలుగేళ్ళలో వ్యవసాయ పెట్టుబడులు చాలా పెరిగిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. అయితే రైతులు పండించే పంటలకు మాత్రం ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో రైతులు నష్టాలపాలు కాక మరేమవుతారని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 194వ రోజు శనివారంనాడు ఆమె విశాఖ జిల్లా చోడవరం సెంటర్‌ నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రసంగించారు.

వరి ధాన్యానికి మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం మొన్న క్వింటాలుకు కేవలం రూ.60 మాత్రమే పెంచడమేమిటని శ్రీమతి షర్మిల  ప్రశ్నించారు. అంటే కనీసం 5 శాతం కూడా పెంచలేదని విమర్శించారు. మరో పక్కన గ్యాస్‌ ధరను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. అంటే యూనిట్‌ గ్యాస్‌కు చెల్లించాల్సిన 4.2 డాలర్లను ఒక్కసారిగా 8.4 డాలర్లకు పెంచేసిందని దుయ్యబట్టారు. గ్యాస్‌ ధర పెంపు కారణంగా మళ్ళీ కరెంటు చార్జీలు, ఎరువుల, గ్యాస్‌ సిలిండర్ల ధరలూ పెరిగిపోతాయని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. ఇలా గ్యాస్‌, పెట్రోల్, డీజిల్‌ ధరలను కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పదే పదే పెంచేసి మరోసారి ఆమ్‌ ఆద్మీని వెన్నుపోటు పొడిచిందని దుయ్యబట్టారు.

ఈ నాలుగేళ్ళలో ఎరువుల ధరలు 300 నుంచి 800 శాతానికి పెరిగాయని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. విత్తనాల ధరలూ పెరిగాయన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలూ పెరిగాయన్నారు. పెట్టుబడులు మాత్రం ఇంతలా పెరిగాయి కానీ వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర మాత్రం పెరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం కమిటీలు సిఫారసు చేసిన మేరకైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం మద్దతు ధర పెంచడంలేదని దుయ్యబట్టారు.

రైతు ఆదాయం నెలకు కేవలం రూ. 1600 మాత్రమే అని అర్జున్‌ సేన్‌ గుప్తా చెప్పిన విషయాన్ని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. అన్నం పెట్టే అన్నదాత ఇప్పుడు నష్టాలపాలైపోయి, మద్దతు ధర లేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందని విచారం వ్యక్తంచేశారు. వరి వేయడం కన్నా ఉరి వేసుకోవడం సులభం అనే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వం అని నిప్పులు చెరిగారు. మద్దతు ధర పెంచాలంటూ తూర్పు గోదావరి జిల్లా రైతులు లక్షా 20 వేల ఎకరాల్లో పంట వేయకుండా క్రాప్‌ హాలిడే ప్రకటించిన సందర్భాన్ని ఆమె గుర్తుచేశారు. కానీ, దున్నపోతు మీద వాన పడిన చందంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం రాలేదని దుయ్యబట్టారు. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మనసు ఉందా లేక బండరాయా? అని ప్రశ్నించారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆఖరి ఏడాది 14,200 మెట్రిక్‌ టన్నుల ధాన్యం పంట పండిందని శ్రీమతి షర్మిల చెప్పారు. ఆయన మరణించిన తరువాత అది 8,600 టన్నులకు పడిపోయిందని వివరించారు. ఇలా పంట ఉత్పత్తి పడిపోవడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు కాదా అని ఆమె ప్రశ్నించారు. ఒక్క మహిళలే కాకుండా మన రాష్ట్రంలోని అన్ని వర్గాల వారూ అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

కరెంటు కోతలు, చార్జీల మోత సహా ప్రజలను అనేక ఇబ్బందుల పాలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అన్ని ప్రతిపక్షాలూ కలిసి అవిశ్వాసం పెడితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు టిడిపి ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసి మరీ రక్షించారని ఆరోపించారు. అంతకు ముందు పాదయాత్రలో ఇదే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నోటికి వచ్చినట్లు దూషించిన ఈ పెద్దమనిషి సమయం వచ్చేసరికి దానితోనే అంటకాగారన్నారు. ఇలాంటి చంద్రబాబును నాయకుడు అనాలా? లేక ఊసరవెల్లి అనాలా? అని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అధికార, ప్రధాన ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యాయని శ్రీమతి షర్మిల విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీతో జగన్మోహన్‌రెడ్డి కుమ్మక్కై ఉంటే జైలులో ఎందుకు ఉండేవారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కై ఉంటే జగనన్న ఈ పాటికి ఏ కేంద్ర మంత్రో, ముఖ్యమంత్రో అయి ఉండేవారు కాదా అన్నారు. జగనన్న ఏ తప్పూ చేయలేదు. అందుకే జైలులో ఉన్నా ధైర్యంగా ఉన్నారన్నారు.

త్వరలోనే జగనన్న బయటికి వస్తారు... మనందర్నీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తారని శ్రీమతి షర్మిల అన్నారు. రాజన్న కలలు కన్న ప్రతి ఎకరాకు జగనన్న సిఎం అయ్యాక సాగునీటిని అందిస్తారని భరోసా ఇచ్చారు. విద్యార్థులను బడికి పంపించేందుకు అమ్మల అకౌంట్‌లోనే నెల నెలా డబ్బులు జమ చేస్తారని భరోసా ఇచ్చారు.

రాజన్న రాజ్యాన్ని ఎవరూ అడ్డుకోలేరని శ్రీమతి షర్మిల అన్నారు. త్వరలో స్థానిక ఎన్నికలు, మరి కొద్ది నెలల్లో సాధారణ ఎన్నికలు వస్తున్నాయని, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టిడిపిలకు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలవాలని ఆమె విజ్ఞప్తిచేశారు.

Back to Top