అధికారంలోకి వచ్చాక కేసులన్నీ ఎత్తివేస్తాం

అనంతపురం, 4 సెప్టెంబర్ 2013:

సీమాంధ్ర ఉద్యమ వీరులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎత్తివేస్తుందని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగుల జీతాలు పువ్వుల్లో పెట్టి జగనన్న ప్రభుత్వం అందిస్తుందని ఆమె అన్నారు. కడుపు మండితే ఎవరైనా నిరసన తెలియజేయవచ్చన్నది రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు అన్నారు. అన్యాయం జరుగుతుండడం వల్లే ఇప్పుడు కోట్లాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే ఈ దుర్మార్గపు ప్రభుత్వం కేసులు పెడుతోందని దుయ్యబట్టారు. ఆందోళనకారులపై కేసులు ఎత్తివేయకపోతే.. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం, జగనన్న సిఎం కావడం ఖాయం అన్నారు. ఉద్యమిస్తున్న ఉద్యోగుల జీతాలు ఇవ్వనని కిరణ్‌ ప్రభుత్వం మొండికేయడాన్ని శ్రీమతి షర్మిల తప్పుపట్టారు. శ్రీమతి షర్మిల చేస్తున్న సమైక్య శంఖారావం బస్సు యాత్ర బుధవారం రాత్రికి అనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా సప్తగిరి సర్కిల్ వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు. సమైక్య ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ జేఏసీ సంఘాలన్నింటినీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తోందని ఆమె అన్నారు. వారి ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు పలుకుతోందని, వారికి వచ్చిన ప్రతి కష్టంలోనూ పార్టీ అండగా నిలుస్తుందని మాట ఇచ్చారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కన్న తండ్రిలాగా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించారన్నారు. ఆయన హయాంలో రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉందో మన అందరికీ తెలిసిందే అన్నారు. మహిళలను లక్షాధికారులను చేశారు. డబ్బు లేదని ఏ ఒక్క విద్యార్ధి చదువూ ఆగిపోకూడదని ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని అమలు చేశారన్నారు. ఆ పథకం కింద లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారు. పేద వా‌ళ్ళు కార్పొరేట్ ఆస్పత్రిలో లక్షల ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేశారన్నారు. చంద్రబాబు 16 లక్షల మందికి పింఛన్లు ఇస్తే.. రాజశేఖరరెడ్డిగారు 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని గుర్తుచేశారు. ఐదేళ్ళ పాలనలో ఏ ఒక్క చార్జి పెంచలేదు, ఒక్క పన్నూ పెంచలేదని, అయినప్పటికీ సంక్షేమ పథకాలను బ్రహ్మాండంగా అమలు చేశారన్నారు. ఆయన పాలనలో సువర్ణ యుగం నడించిందన్నారు.

ఓట్లు, సీట్ల కోసం టిఆర్ఎస్‌ను కలుపుకుని అయినా సరే రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసుకోవాలని మన రాష్ట్రంలోని కోట్లాది మందిని ఇక్కట్లలోకి నెట్టేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని విభజిస్తే.. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ మంచినీరు ఎలా వస్తుందని ప్రశ్నించారు. పరిశ్రమలు, ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపొమ్మంటే సీమాంధ్ర విద్యార్థులు ఎక్కడికి పోవాలన్నారు. అరవై ఏళ్ళు కష్టపడి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్‌లో మనకు భాగం లేదని చెప్పడంలో న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు.

చంద్రబాబు ఆత్మకు ఒక గౌరవం ఉందా?
ఎఫ్‌డిఐకి అనుకూలంగా వ్యవహరించి దేశంలోని లక్షలాది మంది చిన్న వ్యాపారులు, రైతులకు వెన్నుపోటు పొడిచిందే చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తూ కాంగ్రెస్‌ పార్టీ చారిత్రక తప్పిదం చేస్తుంటే.. చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. పట్టపగలే సీమాంధ్రుల గొంతు కోసిన చంద్రబాబు ఇప్పుడు బస్సు యాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మీకు నచ్చినట్లు చీల్చేసుకోండంటూ బ్లాంక్‌ చెక్కులా లేఖ రాసిచ్చిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారు. అసలు చంద్రబాబుకు ఆత్మ అనేది ఉందా.. దానికంటూ ఒక గౌరవం ఏడ్చిందా? పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్న వ్యక్తికి అసలు ఆత్మ అనేది ఉంటుందా! దివంగత వైయస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు శ్రీ జగన్మోహన్‌రరెడ్డి రాజకీయ ఉగ్రవాది అని, ఆయనను ఉరితీయాలని చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి! బాబుకు సంస్కారం ఉండి మాట్లాడుతున్నారా.. లేకుండా మాట్లాడుతున్నారా..? అబద్ధాలను పదే పదే ప్రచారం చేసేదే చంద్రబాబు అని ఆరోపించారు. చీకట్లో చిదంబరాన్ని కలిసి మేనేజ్‌ చేసుకున్నది చంద్రబాబు కాదా అన్నారు.

మీకెలా ఉంటుంది?:
చంద్రబాబు నాయుడుగారూ.. మీరు అందరిపైనా అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. మిమ్మల్ని ఒక్క మాట అడుగుతున్నా.. మీ కుమారుడు లోకేశ్‌ పనికిమాలిన వాడంటే మీకెలా ఉంటుంది? మీరు ఏం చేసినా లోక కల్యాణం కోసమే నిర్ణయాలు తీసుకున్నానని అంటున్నారు.. మీరు తీసుకున్న నిర్ణయాలు లోక కల్యాణం కోసం కాదు, లోకేశ్‌ కల్యాణం కోసమంటే మీకెలా ఉంటుంది. లోకేశ్‌కు అధికారం కట్టబెట్టేందుకే ఎన్టీఆర్‌ వారసులను రాజకీయాల్లో తొక్కి పెడుతున్నారని అంటే మీకెలా ఉంటుంది? అసలు రాష్ట్ర విభజనకు బ్లాంక్‌ చెక్కు లాగా లేఖ రాసిచ్చిన మీరు ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నారు? తెలంగాణకు అనుకూలంగా లేఖను ఇచ్చి ఇప్పుడెందుకు వస్తున్నారని ప్రజలు అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? విభజనపై నిర్ణయం జరిగాక మీరుగాని, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నిస్తే ఏం చెబుతారు? ఆ లేఖను వెంటనే వెనక్కు తీసుకోమని అడిగితే ఏం జవాబు చెప్తారు?

‘మన ఖర్మ ఏమిటంటే.. ఓట్ల కోసం సీట్ల కోసం, తెలంగాణ తామే ఇచ్చామన్న క్రెడిట్‌ కోసం.. కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ఇంకోవైపేమో కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా.. ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, క్రెడిట్‌ తనకు రాకుండా పోతుందని అస్సలు పట్టించుకోవట్లేదు చంద్రబాబు. కాంగ్రెస్‌, టిడిపి కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి.. కోట్ల మంది ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి.. తరతరాలు క్షమించలేని ఘోరమైన పాపం చేస్తున్నాయి’ అని శ్రీమతి షర్మిల విచారం వ్యక్తంచేశారు.

ఏ పరిష్కారం చూపించకుండానే రాష్ట్రాన్ని అడ్డగోలుగా నరికేస్తున్నామని సంకేతాలు ఇచ్చిన వెంటనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన వైనాన్ని పేర్కొన్నారు. కాని సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపి నాయకులు పదవులను పట్టుకుని వేళ్ళాడుతున్నారని విమర్శించారు. న్యాయం చేసే సత్తా లేకపోతే విభజించే హక్కు కాంగ్రెస్‌కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. న్యాయం చేయడం మీకు చేతకాదని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందన్నారు.

'విలువలతో కూడిన రాజకీయాలు చేసే ధైర్యంలేని టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలు కుట్ర పన్ని జగనన్నను జైల్లో పెట్టాయి. ఆయన జైల్లో ఉన్నా తనకు జరిగిన అన్యాయాన్ని పక్కనబెట్టి.. కోట్లాది మంది ప్రజల కోసం వారం రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. జగనన్న జనంలో ఉన్నా, జైలులో ఉన్నా జననేతే. ఈ కాంగ్రెస్, టిడిపి నాయకులు బయట ఉన్నా.. దొంగలు, ద్రోహులే. బోనులో ఉన్నా సింహం సింహమే అన్నారు. త్వరలోనే జగనన్న బయటకు వస్తారు.. మనందరినీ రాజన్న రాజ్యంవైపు నడిపిస్తారు’ అని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top