రైతును రాజులా చేయడం జగనన్నకే సాధ్యం

ఖమ్మం:

మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డిలా రైతును రాజులా తీర్చిదిద్దడం కేవలం వైయస్ఆర్‌సీపీకి, జగనన్నకే సాధ్యమని శ్రీమతి వైయస్‌ షర్మిల అన్నారు. రాజశేఖరరెడ్డిలా ప్రజలందరినీ తన కుటుంబంలా ప్రేమించే మనసు ఎవరికి ఉన్నదని ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. ఓటేసే ముందు మీ గుండెల్లో గూడు కట్టుకున్న వైయస్ఆర్‌ను గుర్తుచేసుకొని ఫ్యాను గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ రాజ్యం తీసుకొస్తామని శ్రీమతి షర్మిల చెప్పారు. ఎన్నికల ప్రచార యాత్ర వైయస్ఆర్ జనభేరిలో భాగంగా బుధవారం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరా, మధిర నియోజకవర్గాల్లో ఆమె పర్యటించి  పలుచోట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

వై‌యస్ఆర్ ప్రతి పథకా‌న్నీ అమలు చేస్తాం :

- మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి తన పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేసి జనం గుండెల్లో నిలిచారు.
- వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  108, 104, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీయింబర్సుమెంట్‌తో పాటు మిగిలిన పథకాలన్నింటినీ తిరిగి అద్భుతంగా అమలు చేస్తాం.
- రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రూ.3వేల కోట్లతో రైతు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం. కరువు, వరదల నుంచి రైతులను ఆదుకునేందుకు రూ.2వేల కోట్లతో మరో నిధిని ఏర్పాటు చేస్తాం.
- రైతులు, మహిళలు, వికలాంగులకు వడ్డీలేని రుణాలు ఇస్తాం. డ్వాక్రా సంఘాల మహిళలు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తాం. రాష్ట్రంలో అర్హులయిన ప్రతి ఒక్క పేదకుటుంబానికీ పక్కా ఇళ్లు కట్టిస్తాం.
- అమ్మఒడి పథకం ద్వారా ఇద్దరు పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లి ఖాతాలో నెలనెలా పదవ తరగతి వరకు రూ.500, ఇంటర్ వరకు రూ.700, డిగ్రీకి రూ.1000 జమచేస్తాం.

ఖమ్మం జిల్లాలో ముగిసిన షర్మిల జనభేరి :
ఖమ్మం జిల్లాలో ఈనెల 13 నుంచి శ్రీమతి షర్మిల చేస్తున్న ఎన్నికల ప్రచార యాత్ర జనభేరి బుధవారంతో ముగిసింది. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఆమె పర్యటించగా..అడుగడుగునా ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు.  పాలేరు నియోజకవర్గం కూసుమంచి నుంచి ప్రారంభమైన శ్రీమతి షర్మిల ప్రచార యాత్ర మధిరలో చివరి సభతో బుధవారం ముగిసింది.

Back to Top