అప్పుడు ఉచిత వైద్యం చేయించలేదేం బాబూ?


ప్రకాశం, గుంటూరు :

‘తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టినప్పుడు ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు ఆల్ ఫ్రీ అంటూ హామీలిస్తున్నారని వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమె ప్రకాశం జిల్లా గిద్దలూరు, మార్కాపురం, గుంటూరు జిల్లా వినుకొండల్లో బహిరంగ సభల్లో మాట్లాడారు.

‘ఆ తొమ్మిది సంవత్సరాలో మీరు అప్పుడే పేదలకు ఎందుకు ఉచిత వైద్యం చేయించలేకపోయారు? ఎందుకు రైతు రుణాలను మాఫీ చేయలేకపోయారు? ఇప్పుడేమో ఆల్ ఫ్రీ అంటూ మీ ముఖం చూసి ఓట్లేయాలని ప్రజలను ‌ఎలా అడుగుతున్నారు’ అని శ్రీమతి షర్మిల నిలదీశారు. 2009లోనే మహా కూటమి ఏర్పాటుచేసి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆల్ ఫ్రీ హామీలను జనం నమ్మలేదు. ఈ సారి కూడా జనం మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబూ. మీ ముఖం చూసి ఓటేయాలని అడుగుతుంటే నవ్వొస్తోంది’ అన్నారు.

'‌చంద్రబాబు నాయుడి హయాంలో రైతులకు పెట్టుబడి ధరలు పెరిగి మద్దతు ధరలు రాలేదు. ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచి వాటిని వసూలు చేయడం కోసం రైతుల మీద కేసులు పెట్టించారు. చార్జీలు కట్టని వారిని పోలీసుస్టేషన్లకు పంపారు. వ్యవసాయం దండగన్నారు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందన్నారు. అప్పుల పాలై వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు రైతుల రుణాలు మాఫీ చేస్తానంటున్నారు. మీదంత మంచి మనసే అయితే సీఎంగా ఉండగా ఎందుకు చేయలేకపోయారు?’ అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు.

Back to Top