అన్నదమ్ముల మధ్య అగ్గిపెట్టిన కాంగ్రెస్

తిరుపతి, 2 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల సమైక్య శంఖారావం పూరించారు. అన్నదమ్ముల మధ్య అగ్గి పెట్టి కాంగ్రెస్‌ పార్టీ చలి కాచుకుంటోందని ఆమె నిప్పులు చెరిగారు. తెలుగువారి భిక్షతో కేంద్రంలో, రాష్ట్రంలో గద్డెనెక్కి, ఇప్పుడు తెలుగు వారి మధ్యనే చిచ్చు పెట్టిందని దుయ్యబట్టారు. కడుపునకు కావాల్సింది ఇంత అన్నమా లేక సీమాంధ్రుల రక్తమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే ఇప్పటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆమె అన్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో నిర్వహించే 'సమైక్య శంఖారావం' బస్సు యాత్రను తిరుపతిలో శ్రీమతి షర్మిల సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి లీలామహల్‌ సెంటర్‌లో సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. 'చిత్తూరు జిల్లా ప్రజలకు, తిరుపతి నగర వాసులకు మీ రాజన్న బిడ్డ, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది' అంటూ శ్రీమతి షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

రాజశేఖరరెడ్డిగారి హయాంలో అన్నపూర్ణగా మారిన మన రాష్ట్రం ఆయన వెళ్ళిపోయిన ఈ నాలుగేళ్ళలో కుక్కలు చింపిన విస్తరిలా తయారైపోయిందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. గత నాలుగేళ్ళుగా ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమానికి పాడె కట్టిందని, అభివృద్ధిని అటకెక్కించిందని నిప్పులు చెరిగారు. తెలుగువారి పైనే వేటు వేసింది, వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్‌ పార్టీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేం ఇచ్చిన అధికారంతో మా కళ్ళే పొడుస్తారా? మా బ్రతుకులనే బుగ్గిపాలు చేస్తారా? అని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. విభజన పేరుతో కాంగ్రెస్‌ పార్టీ తెలుగువారికి వెన్నుపోటు పొడిచిందని దుయ్యబట్టారు.

విభజన పేరుతో సీమాంధ్రను వల్లకాడు చేస్తారా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. ఒక తండ్రిలా అందరికీ సమన్యాయం చేయాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ చెబుతూనే ఉందని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ‘హఠాత్తుగా ఏమాత్రం ముందు చూపులేకుండా తలకాయ ఒకరికి, మొండెం ఒకరికి అన్నట్లు.. పై భాగం, కింది భాగంగా రాష్ట్రాన్ని విడగొడితే.. కింది భాగంలో ఉన్నవారికి కనీసం సాగునీరు కాదు కదా.. తాగు నీరుకు కూడా దిక్కుండదని తెలిసీ.. ఈ కాంగ్రెస్ పార్టీ ఓ‌ట్లు, సీట్ల కోసం, టిఆర్‌ఎస్‌ను తనలో కలుపుకోవడం కోసం.. ఇంత ఘోరానికి, కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకొంది’ అని దుయ్యబట్టారు.

ఇప్పటికే మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత.. కర్ణాటకలో‌ని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండితే తప్ప మన రాష్ట్రానికి నీళ్లు వదలని పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు మధ్యలో ఒక రాష్ట్రం వచ్చి.. కృష్ణా నీళ్లను అడ్డుకుంటే.. శ్రీశైలం ప్రాజెక్టుకు, నాగార్జున సాగర్‌కు నీళ్లు ఎక్కడ నుంచి వస్తాయి? ఇంతవరకు అన్నదమ్ముల్లా బతికిన కృష్ణా ఆయకట్టు రైతాంగం.. ఇప్పుడు నీళ్ల కోసం తన్నుకొని చావాలా? రాయలసీమ రైతాంగానికి ఒక్క పంటకైనా దిక్కు ఉంటుందా? వాళ్ల ఇళ్లలో అన్నముంటుందా? గడప గడపలోనూ ఆత్మహత్యలు జరగవా? గ్రామాలన్నీ శ్మశానాలుగా మారిపోవా? కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టును చేస్తామంటోంది కేంద్ర ప్రభుత్వం.. మధ్యలో ఒక రాష్ట్రం వస్తే పోలవరానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పడం లేదు. శ్రీకాకుళం, నుంచి కుప్పం దాకా సముద్రం నీరు తప్ప మంచినీరు ఎక్కడుంది? కృష్ణా నీళ్లను అడ్డుకుంటే సీమాంధ్ర ఒక మహా ఎడారి అయిపోదా?

ఉప ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో పనిచేసింది మీరు కాదా చంద్రబాబుగారూ అని శ్రీమతి షర్మిల నిలదీశారు. ప్రతి ఎన్నికల్లోనూ స్వార్థాన్నే చూసుకున్న చంద్రబాబును ప్రతిపక్ష నాయకుడనాలా? లేక దుర్మార్గుడనాలా? అని ప్రశ్నించారు. ప్రజల తరపు మాట్లాడకపోగా హైదరాబాద్ ను నాలుగు లక్షల కోట్లకు అమ్మకానికి పెట్టింది మీరు కాదా? అని బాబును ‌నిలదీశారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని కాపాడిన మీకు గౌరవం ఎక్కడుంది? తెలంగాణను మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమని కేంద్రానికి లేఖ రాసింది మీరు కాదా? ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కాంగ్రెస్‌తో పాలు నీళ్ళులా కలిసిపోయారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనకు బ్లాంక్‌ చెక్కులా లేఖ రాసి ఇచ్చారని విమర్శించారు. ఆ లేఖను చంద్రబాబు ఇప్పటికి వెనక్కి తీసుకోని వైనాన్ని వెల్లడించారు. మీరు రాజీనామా చేసి, మీ వారి చేత ఎందుకు రాజీనామా చేయించలేదు? కోట్ల మందికి జరుగుతున్న అన్యాయంపై ఎందుకు మాట్లాడరు? అని శ్రీమతి షర్మిల చంద్రబాబును ప్రశ్నించారు. 'పట్టపగలే సీమాంధ్రుల గొంతు కోసి మళ్లీ ఏ ముఖం పెట్టుకుని సీమాంధ్రలో అడుగుపెట్టాలని అనుకున్నారు చంద్రబాబూ’ అని సీమాంధ్ర ప్రజలు అడుగుతున్నారు. ‘ఇంత అన్యాయం జరుగుతుంటే.. మీరు నిరసన ఎందుకు చేయడం లేదు? మీరు రాజీనామా చేసి మీ వాళ్లతో ఎందుకు రాజీనామా చేయించలేదు’ అని ప్రజలు ప్రశ్నిస్తే.. ఏమని సమాధానం చెప్తారు చంద్రబాబు?’ అని షర్మిల ప్రశ్నించారు.

హైదరాబాద్‌లోని సీమాంధ్రుల ఆస్తులను లాక్కుంటామని టిఆర్ఎస్‌ అన్నది నిజమా? కాదా? అని శ్రీమతి షర్మిల అన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న సీమాంధ్రుల విగ్రహాలు టిఆర్ఎస్‌ కూల్చింది వాస్తవమా? కాదా? అన్నారు. సీమాంధ్రుల ఫ్యాక్టరీల మీద పడి దాడులు చేయడం వాస్తవం కాదా? విభజన జరగక ముందే వీళ్లు ఇలా ఉంటే.. విభజనంటూ జరిగితే కింద ఉన్న రాష్ట్రానికి వాళ్లు నీళ్లు వదులుతారా? హైదరాబాద్‌లో, తెలంగాణలో బతుకుతున్న సీమాంధ్రులను అక్కడ ఉండనిస్తారా? అక్కడ ఆఫీసుల్లో, స్కూళ్లలో, అక్కడ హాస్పిటళ్లలో, దుకాణాల్లో, ఫ్యాక్టరీలలో, హోటళ్లలో పనిచేస్తున్నవారిని కనీసం మనుషుల్లా చూస్తారా? సీమాంధ్రులు అక్కడ చదువుకోగలుగుతారా? చదువుకున్న వారు ఉద్యోగాలు చేసుకోగలుగుతారా? ఉద్యోగాలు కాదు .. కనీసం ఆటో నడుపుకోగలుగుతారా? కనీసం ఒక టీ కొట్టయినా పెట్టుకోగలుగుతారా? అన్నారు. రాజధాని పక్క రాష్ట్రంలో ఉంటే.. హైదరాబాద్‌లో బతుకుతున్న సీమాంధ్రులంతా ఇక బిక్కుబిక్కుమంటూ ద్వితీయ శ్రేణి పౌరుల్లా పక్క రాష్ట్రం దయాదాక్షిణ్యాల మీద బతకాలా? వారిని ఎప్పుడెప్పుడు వెళ్లగొడదామా అని చూస్తున్న తెలంగాణ నాయకుల మధ్య వారికి గాని, వారి కుటుంబాలకు గాని, వారి ఆస్తులకు గాని భద్రత ఉంటుందా?

నాలుగైదు లక్షల కోట్లిస్తే కొత్త రాజధాని కట్టుకోవచ్చని చంద్రబాబు అంటున్నారు. డబ్బంతా కొత్త రాజధాని కట్టుకోవడానికే సరిపోతే.. ఇక సంక్షేమ పథకాలు ఎలా నడపాలి? ఈ రోజు మన రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం మన హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం 50 శాతం పైనే. ఒక్కసారిగా అంత ఆదాయం ఆగిపోతే.. సంక్షేమ పథకాలు ఎలా నడపాలి? ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు మాట్లాడడంలేదన్నారు. హైదరాబాద్ చుట్టూ వేలకొద్దీ ఎకరాలను, వేల కోట్లు విలువ చేసే భూములను‌ చంద్రబాబు తన బినామీలకు రాసిచ్చేసుకున్నారు. మన రాష్ట్రం అంతా ఒక్కటిగానే ఉంటే.. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే.. ఆయన ప్రభుత్వంలో తన ఆస్తులకు భద్రత ఉండదని, కాంగ్రెస్ పార్టీ అయితే తన ఆస్తులను భద్రంగా కాపాడుతుందని చంద్రబాబు ఈ రోజు తెలంగాణ ఇచ్చేయండి అంటున్నారు. హైదరాబా‌ద్‌ను కూడా బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చేయండి అంటున్నారు. చంద్రబాబుగారూ.. ఈ రోజు తెలుగుదేశం పార్టీని రెండు ప్రాంతాల్లోనూ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని మీరు ఆరోపిస్తూ మొసలి కన్నీళ్లు కారుస్తూ ఎందుకు అంతలా గింజుకుంటున్నారు? ఈ రోజు తెలుగుదేశం పార్టీ అన్ని ప్రాంతాల్లో చచ్చిపోయిందీ అంటే దానికి కారణం.. మీకు వ్యక్తిత్వం లేకపోవడం కాదా? అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు.

సీమాంధ్రులకు అన్యాయం జరగకూడదనే జగనన్న ఏడు రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేశారని శ్రీమతి షర్మిల తెలిపారు. న్యాయం చేయలేరని తేలిపోయింది కాబట్టే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నది జగనన్న మాట అన్నారు. మహానేత వైయస్ఆర్‌ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఆయన పథకాలకు తూట్లు పెట్టిందని దుయ్యబట్టారు.

రాష్ట్రంలోని తొమ్మిది కోట్ల మంది ప్రజలలో 6 కోట్ల సీమాంధ్రులు విభజనను వ్యతిరేకిస్తున్నారని శ్రీమతి షర్మిల తెలిపారు. సిపిఎం, ఎంఐఎం, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఎప్పుడూ విభజనకు అనుకూలంగా లేవని తెలిపారు. ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్ ‌నాయకులు మాత్రం పదవులు పట్టుకుని వేలాడుతున్నారని విమర్శించారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రజల పక్షాన నిలబడుతుంది : శ్రీమతి విజయమ్మ

అంతకు ముందు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ప్రారంభోపన్యాసం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ప్రజల పక్షాన ని‌లబడి పోరాడుతోందని తెలిపారు.  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే రాష్ట్రంలో ప్రస్తుత‌ పరిస్థితి దాపురించేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓట్లు, సీట్లు కోసమే కాంగ్రెస్‌ పార్టీ విభ‌జించాలని నిర్ణయం తీసుకుందని విమర్శించారు.

మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి‌ 4వ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయన సమాధికి శ్రీమతి షర్మిల నివాళులు అర్పించిన అనంతరం సాయంత్రం తిరుపతికి చేరుకున్నారు. తిరుపతి లీలామహల్ సెంటర్ వద్ద జరిగిన భారీ బహిరంగసభలో సమైక్య శంఖారావాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వం వహించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, పార్టీ సీఈసీ సభ్యురాలు రోజా తదితర నాయకులు ఈ బహిరంగసభలో పాల్గొన్నారు.

శ్రీమతి షర్మిల బహిరంగసభకు భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. సభా ప్రాంతానికి తరలివచ్చిన అశేష జనవాహినితో లీలామహల్‌ సెంటర్‌ సంద్రంలా మారిపోయింది. శ్రీమతి షర్మిలకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. కాగా, శ్రీమతి షర్మిల ప్రసంగంగ ప్రారంభమైన కొద్దిసేపటికే సభా ప్రాంతం అంతా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అక్కడికి మరి కొంత దూరంలో మాత్రం విద్యుత్‌ సరఫరా యధావిధిగా ఉండడం గమనార్హం.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top