చంద్రబాబు దిగజారుడుకు ఇదే నిదర్శనం


ఏలూరు:

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిని ఆ రోజుల్లో ఎన్నికల్లో ఒంటరిగా ఎదుర్కొనే దమ్మూ ధైర్యం లేక చంద్రబాబు అన్ని పార్టీలను కలుపుకుని పోటీచేసినా అధికారంలోకి రాలేకపోయారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆ మహానేత కొడుకుని కూడా ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. అందుకే ఎక్కడి నుంచో మోడీని, ఇక్కడ నుంచి సినిమా నటుడు పవన్ క‌ళ్యాణ్‌ని తెచ్చుకున్నారని విమర్శించారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు మోడీ కాళ్లు పట్టుకున్నారంటే అర్థం ఉంది. కానీ చివరికి పవన్ క‌ళ్యాణ్ కాళ్లు కూడా పట్టు‌కోవడం ఆయన దిగజారుడు నైజానికి పరాకాష్ట అన్నారు. తెలుగుదేశం నాయకులను, టీడీపీ పరిస్థితిని చూస్తే జాలేస్తోంది’ శ్రీమతి షర్మిల విచారం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కొవ్వూరులో శుక్రవారం నిర్వహించిన ‘వైయస్ఆర్ జనభేరి’ సభల్లో ఆమె మాట్లాడారు.

‘ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి రూ.70 కోట్లకు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారని, ఆయన తమ్ముడు పవన్‌ కళ్యాణ్ ఇప్పుడు ఎంతకు అమ్ముడుపోయా‌రో తెలియాల్సి ఉందని శ్రీమతి షర్మిల అన్నారు. ఒక్క మంత్రి పదవి కోసం ఆయన అన్నగారు పార్టీని మూసేశారు. ఈయన ఏ మంత్రి పదవి వస్తుందని బీజేపీ, టీడీపీ పక్కన చేరారో తేలాల్సి ఉందన్నారు. సీమాంధ్రకు అన్యాయం జరిగితే ఊరుకోనని చిందులు తొక్కుతున్న పవన్ క‌ళ్యాణ్.. 2009లో పీఆర్పీ మేనిఫెస్టోలో తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజల గొంతు కోసిన బీజేపీ, టీడీపీ నేతలనే ఆయన కౌగిలించుకుని నీతులు చెబుతున్నారన్నారు. పవన్ క‌ల్యాణ్ చెప్పేదంతా సొల్లే‌ అని కొట్టిపారేశారు. చంద్రబాబుకు ఓటేయవద్దని గత ఎన్నికల్లో పవన్ క‌ళ్యాణ్ చెప్పలేదా? ‌అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయనకు ఓటేయాలని ఎలా చెబుతున్నార’ని శ్రీమతి షర్మిల నిలదీశారు.

Back to Top