<br/>అనంతపురం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటామని ఎస్‌కే యూనివర్సిటీ విద్యార్థులు పేర్కొన్నారు. వైయస్ జగన్ నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు ఎస్‌కే యూనివర్సిటీ విద్యార్థులు సంఘీభావం తెలిపారు. బుధవారం రూరల్ మండలంలో విద్యార్థులు వైయస్ జగన్‌ను కలిశారు. ప్రత్యేక హోదా కోసం మీరు చేస్తున్న ఉద్యమంలో మేము భాగస్వాములం అవుతామని విద్యార్థులు ప్రతిపక్ష నేతకు మాట ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వస్తే మాలాంటి యువత బాగుపడుందని, ప్రత్యేక ప్యాకేజీ వస్తే టీడీపీ నేతలకు మాత్రమే మేలు జరుగుతుందని అన్నారు. తన కొడుకు నారా లోకేష్‌కు అడ్డదారిలో మంత్రి పదవి ఇచ్చుకున్న చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఇంటికో ఉద్యోగం హామీని విస్మరించారన్నారు. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేశారని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటు అన్నారు. జిల్లాలో డబుల్ పీజీలు చేసిన మాలాంటి ఎందరో యువకులు రోడ్డుపై తిరుగుతున్నారని, ఉద్యోగాలు ఇచ్చే నాథుడు లేడన్నారు. రాష్ట్రంలో ఉపాధి లేక జిల్లా వాసులు వలస వెళ్తున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో టీడీపీ నాయకులు పరిశ్రమలు పెట్టారని, అదే హోదా మన రాష్ట్రానికి వస్తే ఎన్నో పరిశ్రమలు వస్తాయన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వైయస్ జగన్‌కు అండగా ఉంటామని, టీడీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని యూనివర్సిటీ విద్యార్థులు హెచ్చరించారు.