'సిరిశాల'ను 'ఉరిశాల'గా మార్చేసిన టిడిపి

హైదరాబాద్, 30 మార్చి 2013: ఒకప్పుడు 'సిరిశాల'గా భాసిల్లిన సిరిసిల్ల టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత 'ఉరిశాల'గా మారిపోయిందనిపార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కె.కె. మహేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలి చావులకు, ఆత్మహత్యలకు సిరిసిల్ల నిలయంగా మారిందన్నారు. సమస్య ఎక్కడ ఉంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అక్కడ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలను స్వయంగా పరిశీలించేందుకే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం శుక్రవారం వెళ్ళిందన్నారు. వారి సమస్యలను పరిష్కరించే వరకూ ప్రజల పక్షాన ప్రభుత్వంతో తమ పార్టీ ప్రజల మధ్యే ఉంటుందని, పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజలతో మమేకమై, ప్రజల పక్షాన నిలబడాలన్న ఏకైక లక్ష్యంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటైందని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ, అనేక దీక్షలు చేస్తూ ముందు సాగుతున్న ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. నేతన్నలకు దుర్భరమైన పరిస్థితి వస్తుందనే ఐదారు నెలల క్రితం పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ సిరిసిల్లలో 'చేనేత దీక్ష' చేశారని ఆయన గుర్తుచేశారు. అయితే, ఆ ప్రాంతానికి చెందిన ఎంపీతో సహా ప్రజా ప్రతినిధులంతా ఆమె దీక్షను వ్యతిరేకించారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రాంత సమస్యలను పట్టించుకోవడానికి మీరెవరంటూ శ్రీమతి విజయమ్మ దీక్షకు ఆటంకాలు సృష్టించారని ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా ప్రజా సమస్యలపై తమ పార్టీకి చిత్తశుద్ది ఉన్నందువల్లే సిరిసిల్ల నడిబొడ్డున శ్రీమతి విజయమ్మ దీక్ష నిర్వహించారన్నారు. ఫలితంగా ప్రభుత్వం స్పందిందిచ రూ. 31 కోట్ల బకాయిలను విడుదల చేసిందని చెప్పారు.

సర్‌చార్జీల పేరుతో ఇప్పుడు వేలకు వేలల్లో విద్యుత్‌ బిల్లులు వస్తుంటే వాటిని కట్టలేక, మానసిక క్షోభకు గురై నేతన్నలు మరణించిన సంఘటనలు జరుగుతుండడంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుల బృందం పరిస్థితిని పరిశీలించేందుకు నిన్ననే మరోసారి సిరిసిల్ల వెళ్ళినట్లు చెప్పారు. రైతన్నల తరువాత ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నది చేనేతన్నలే అని మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక మనసున్న మనిషిగా సిరిసిల్లను స్వయంగా సందర్శించి అనేక రకాల సబ్సిడీలు, హామీలు ఇచ్చిన వైనాన్ని గుర్తుచేశారు. అందులో భాగంగానే 'అంత్యోదయ పథకం' కింద ప్రతి కుటుంబానికీ 30 కిలోల బియ్యం కూడా ఆయన ఇచ్చారన్నారు.

రాష్ట్రం మొత్తంలో 70 వేల పవర్‌లూమ్‌లు ఉంటే ఒక్క సిరిసిల్లలోనే 35 వేలు ఉన్నాయని మహేందర్‌రెడ్డి తెలిపారు. సుమారు 40 నుంచి 45 వేల మంది పవర్‌లూమ్ కార్మికులు సిరిసిల్లలోనే ‌జీవనం కొనసాగిస్తున్నారన్నారు. అందుకే మహానేత‌ విద్యుత్‌ వాడకంపై 50 శాతం సబ్సిడీ కూడా ఇచ్చారన్నారు. యూనిట్‌ విద్యుత్‌ చార్జీ రూ.1.20 ఉండగా 90 పైసలు మాత్రమే చెల్లించే విధంగా మహానేత ఏర్పాటు చేశారన్నారు. కాగా, సబ్సిడీల మోత కారణంగా సబ్బిడీ పోగా కూడా యూనిట్‌కు రూ. 3 చెల్లించాల్సి వస్తోందని మహేందర్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు రెండు వేలు వచ్చే బిల్లు ఇప్పుడు నాలుగు, ఐదు వేలకు పైబడే వస్తున్నదన్నారు. నెలంతా కాదు కదా సంవత్సరమంతా కష్టపడి సంపాదించినా వారికి వచ్చే ఒక నెల విద్యుత్‌ బిల్లుకు సరిపోవడంలేదన్నారు.

ఒక వైపున చేనేత కార్మికుల దుస్థితి ఇలా ఉంటే ప్రజలు తమను అర్థం చేసుకున్నారు కాబట్టి  బిల్లులు కడుతున్నారని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పడాన్ని మహేందర్‌రెడ్డి తప్పు పట్టారు. ఇది ఎంతవరకూ సమంజసమో ప్రజలే ఆలోచించాలన్నారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ సిఎంగా ఉన్నప్పుడు మహిళా సంఘాలకు రెండు లక్షల రూపాయలు ఇచ్చేవారన్నారు.  సిరిసిల్ల పట్టణంలో మాత్రం ప్రత్యేకంగా రూ. 5 లక్షలు ఇచ్చిన వైనాన్ని వివరించారు. ఆరు వేల మంది పవర్‌లూమ్‌ కార్మికులకు ఆయన ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చారన్నారు. కానీ, ఆయన మరణించిన తరువాత ఆ స్థలాలపై ఇళ్ళు కట్టించే నాథుడే లేకుండాపోయారని ఆయన విచారం వ్యక్తంచేశారు. చేనేతకు ముడిసరుకు కూడా స్థానికంగా అందుబాటులో ఉంచేలా చూస్తానని చెప్పారన్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం చేనేత కార్మికుల కష్టాలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
Back to Top