సిఎం నిర్లక్ష్యం వల్లే బాంబు పేలుళ్ళు

నారాయణపట్నం (గుంటూరు జిల్లా), 24 ఫిబ్రవరి 2013: హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ లో జంట బాంబు పేలుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం, సి.ఎం. కిరణ్‌ నిర్లక్ష్యమే కారణమని శ్రీమతి షర్మిల విమర్శించారు. హైదరాబాద్‌లో ఉగ్రవాద దాడులు జరుగుతాయని కేంద్రం ముందుగానే హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం అంటే సిఎం కిరణ్‌ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె ధ్వజమెత్తారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఆదివారం సాయంత్రం గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని నారాయణపట్నంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉగ్రవాదులు బాంబులు పేల్చి అమాయక ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్నా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమేమిటని శ్రీమతి షర్మిల సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి కూల్చే అవకాశం ఉన్నా చంద్రబాబు ఆ పని చేయడం లేదని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబే కాపాడుతున్నారని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసమే ఆయన ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు.

రాష్ట్ర రాజధానిలో బాంబులు పేలి 16 మంది మరణించారని, 120 మంది ఆస్పత్రి పాలయ్యారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారిలో అత్యధికులు యువకులని, పలువురు విద్యార్థులు కూడా ఉన్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఉగ్ర దాడుల గురించి కేంద్రం సమాచారం ఇచ్చిందట. అయితే, దాన్ని రొటీన్‌ అనుకుని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదట అని ఎద్దేవా చేశారు. ఆక్టోపస్‌ విభాగాన్ని గాని, ఉగ్రవాద వ్యతిరేక దళాలను రంగంలోకి దించకుండా నిర్లక్ష్యం చేసిందని శ్రీమతి షర్మిల ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించాల్సి బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్లే ఆ ప్రమాదం జరిగిందన్నారు.

బాంబు పేలుళ్ళలో మరణించిన వారి ఫొటోలను, వారి కుటుంబ సభ్యుల చిత్రాలను పేపర్లలో చూస్తుంటే ఎంతో బాధగా ఉందని శ్రీమతి షర్మిల విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులైన వారిలో ఎందరో తాము బ్రతుకుతామో లేదో తెలియని పరిస్థితుల్లో మానసికంగా చిత్రహింస అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత ప్రమాదం జరిగినా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రరెడ్డి తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

కిడ్నీలు అమ్ముకునే దుస్థితిలో అన్నదాత: 
‘మూడు ఎకరాలలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినా. అప్పులపాలై అష్టకష్టాలు పడుతున్నా. దేశం మొత్తం రైతులు ఇట్నే ఉన్నారమ్మా..’ అని నారాయణపురానికి చెందిన రైతు నాగేశ్వర్‌రావు చెప్పడంతో శ్రీమతి షర్మిల చలించిపోయారు. త్వరలోనే జగనన్న నేతృత్వంలో రైతన్న రాజ్యం వస్తుందని భరోసా ఇచ్చారు. నారాయణపురంలో రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీనితో శ్రీమతి షర్మిల రచ్చబండ వేదిక నుంచే మాట్లాడారు.

‘గ్రామాలు మళ్లీ కరవు కోరల్లో చిక్కి వల్లకాడుగా మారిపోతున్నాయి. అప్పులు చేసి భూమిలో విత్తనం వేసినా.. పాలకుల నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట చేతికందలేదు. కొద్దోగొప్పో అందినా గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఆదుకునే దిక్కులేక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. అప్పుల బాధలు తాళలేక అన్నదాతలు కిడ్నీలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు..’ అని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల పట్ల చిత్తశుద్ధి లేని సర్కారు ఇది:
'ఈ నెలలోనే అకాల వర్షాలు కురిశాయి. ఆరున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వ ప్రాథమిక విచారణలో తేలింది. నిజానికి ఇంతకన్నా మూడింతలు ఎక్కువగా నష్టం జరిగిందని అంచనాలు చెబుతున్నాయి. వరి, పత్తి, మిరప, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. నోటి దగ్గరి ముద్ద నేలపాలయినట్లు మార్కెట్ యార్డుకు తెచ్చిన తర్వాత పత్తి, మిరప పూర్తిగా తడిసిపోయి రైతన్నల ఆశల మీద నీళ్లు చల్లింది. అయినా ఏ ఒక్క ఎమ్మెల్యే కాని, మంత్రి కాని, అధికారి కాని నష్టపోయిన రైతు వద్దకు వెళ్లి పలకరించలేదు. పంట నష్టాన్ని పరిశీలించి, నష్టపరిహారం ఇస్తామని రైతుకు భరోసా కల్పించే ప్రయత్నం చేయలేదు. ఇప్పటి అకాల వర్షాలకే కాదు... నీలం తుపానుకు 13 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. లైలా, జ‌ల్ తుపా‌ను వచ్చినప్పుడు రూ.600 కోట్ల పంట నష్టం జరిగిందని సర్కారే అంచనా వేసింది. అయినా రైతులకు ఇచ్చిన నష్టపరిహారం ఎంతో తెలుసా? కేవలం రూ.17 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇదీ మన పాలకులకు రైతులు, వ్యవసాయం పట్ల ఉన్న చిత్తశుద్ధి అన్నారు.

అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు సమర్ధుడు :
'చంద్రబాబుగారు పాదయాత్రలో అన్నీ అబద్ధాలే చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కళ్లార్పకుండా ఎన్ని అబద్ధాలైనా చెప్పగల సమర్థుడు ఆయన. చంద్రబాబు తన పాలన చాలా బాగుందని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఆయన గారు ఏ చార్జీలనూ పెంచలేదట. 8 సంవత్సరాల 8 నెలలు అధికారంలో ఉన్న చంద్రబాబు 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. అవి కట్టలేమని రైతులు మొత్తుకున్నా వినలేదు. ప్రత్యేకంగా కోర్టులు, పోలీసు స్టేషన్లు పెట్టి రైతన్నలను చిత్రహింసలు పెట్టారు. ఆర్టీసీని బాదేశారు. గ్యాస్ ధర పెంచారు. అన్ని రకాల పన్నులు పెంచారు. అయ్యా..! నీ పరిపాలనలో రైతు కుటుంబాలు కుదేలై అప్పుల బాధలు ఒకవైపు, బిల్లుల కోసం పోలీసు స్టేష‌న్‌కు ఈడ్చితే ఆ అవమానం తట్టుకోలేక మరోవైపు 4 వేల మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు' అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

'చంద్రబాబు ఇంకో మాట కూడా చెబుతున్నారు. తనకు అధికారం ఇస్తే ఆరు నెలల్లో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతారట! ఈ మాట వింటే నవ్వొస్తుంది. రాష్ట్రంలో మరోసారి చంద్రబాబు నాయుడో.. ఈ కాంగ్రెస్ పా‌ర్టీయో అధికారంలోకి వస్తే అంతకన్నా శాపం మరోటి ఉండదు. కాంగ్రెస్, ‌టిడిపిలు కుమ్మక్కై జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టాయి. ఇది ప్రజాస్వామ్య దేశం. ఏదో ఒక రోజున నిజం గెలుస్తుంది. జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యం స్థాపిస్తారు. రాజన్న కలలుగన్న కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తారు' అని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.

ఆదివారం 73వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర దాచేపల్లి మండలం శ్రీనగర్ నుంచి ప్రారంభమైంది. గామాలపాడు, నారాయణపురం మీదుగా దాచేపల్లికి చేరింది. అబద్ధపు కేసులతో శ్రీ జగ‌న్‌ను నాలుగు గోడల మధ్య బంధించడాన్ని నిరసిస్తూ వేల సంఖ్యలో ప్రజలు నల్లబ్యాడ్జీలు కట్టుకొని శ్రీమతి షర్మిలతో పాటు కదం తొక్కారు. రాత్రి 8.15 సమయంలో తక్కెళ్లపాడు శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. ఆదివారంనాడు మొత్తం 14 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 1035 కిలోమీటరల్ పాదయాత్ర పూర్తయింది.

శ్రీమతి షర్మిల వెంట నడిచిన నాయకులలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, ఆ‌ర్‌కే, తలశిల రఘురాం, ముదునూరి ప్రసాదరాజు, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, లక్ష్మీరాజ్యం, పి.గౌతంరెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ తదితరులు ఉన్నారు.
Back to Top