షర్మిల పాదయాత్రతో చంద్రబాబుకు గుబులు

చిత్తూరు:

దివంగత మహానేత డాక్టర్ వైయస్. రాజశేఖర రెడ్డి కుమార్తె, వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు శ్రీ వైయస్. జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు గుబులు పట్టుకుందని పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ఏయస్. మనోహర్ అభిప్రాయపడ్డారు, అందుకే ఆ పార్టీ నేతలు పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. చిత్తూరు రూరల్ మండలం నాయనిచెరువులో ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన జయరామనాయుడు ఆధ్యర్యం లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 150 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మనోహర్ మాట్లాడుతూ శ్రీ జగన్మోహన్‌ రెడ్డికి బెయిల్ ఇస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే భయంతోనే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. వారి కుళ్లు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారనీ, తగిన సమయంలో గుణపాఠం చెబుతారనీ హెచ్చరించారు. అవిశ్వాసం పెడితే ప్రభుత్వం పడిపోతుందని, తర్వాత వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించే టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని వివరిం చారు. వైఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు పార్టీలకతీతంగా లబ్ధిపొందారని తెలిపారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి వైయస్ఆర్ సీపీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

Back to Top