షర్మిలకు ఖమ్మం ఘన స్వాగతం

వల్లభి(ఖమ్మం జిల్లా):

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిలకు ఖమ్మం జిల్లా వల్లభిలో సోమవారం సాయంత్రం ఘన స్వాగతం లభించింది.  తొలుత మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం 128వ రోజు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం షేక్ మహ్మద్‌పేట  నుంచి ప్రారంభమయింది. అక్కడి నుంచి గండ్రాయికి చేరుకుంది. అకాల వర్షానికి తడిసిన మిరపను, రాలిపోయిన మామిడి తోటలను శ్రీమతి షర్మిల పరిశీలించారు. నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. గండ్రాయి గ్రామంలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారు కొరివి సీతమ్మ తన సొంత స్థలంలో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి మధిర నియోజకవర్గం వల్లభి గ్రామం ద్వారా శ్రీమతి షర్మిల ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించారు.

తెలంగాణ సంప్రదాయక నృత్యం కోలాటం, గిరిజన సంప్రదాయక నృత్యం కొమ్ముడోలు నృత్యంతో అక్కడి ప్రజలు ఆమెకు స్వాగతం పలికారు. వల్లభి శివారులో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 9 గంటలకు చేరుకున్నారు. సోమవారం మొత్తం 13.6 కిలోమీటర్లు నడిచారు. ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సామినేని ఉదయభాను, మచ్చ శ్రీనివాసరావు, వంగవీటి రాధ, రమేష్‌బాబు, ప్రసాదరాజు, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి పద్మ, గోనె ప్రకాశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, తలశిల రఘురాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చందా లింగయ్య, యడవెల్లి కృష్ణ, గౌతంరెడ్డి, తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.
సోమవారం పాదయాత్ర ముగిసే నాటికి 128 రోజులు, 1,730.3 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది.

Back to Top