అవిశ్వాసంపై చంద్రబాబు తీరు సిగ్గుచేటు

నిన్నటి వరకు  ప్రశ్నించని బాబుకు ప్రజలు మద్థతు పలుకుతారా?
చిత్తశుద్ధి ఉంటే పవన్ ఆరోపణలకు సమాధానాలివ్వాలి
మాజీ మంత్రి పార్ధసారథి డిమాండ్ 

విజయవాడ :తనపై విశ్వాసంతోనే దేశంలోని బిజెపి వ్యతిరేక పక్షాలు అవిశ్వాస తీర్మానానికి మద్ధతు పలికాయంటూ చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కె.పార్థసారథి ధ్వజమెత్తారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి వరకు ఎన్ డిఎలో భాగస్వామ్యులుగా ఉంటూ, అవిశ్వాస తీర్మానంతో ఒరిగేదేముందంటూ మాట్లాడిన చంద్రబాబు , ఈ రోజు అవిశ్వాస తీర్మానం అనేది తనపై ఇతర పార్టీలకున్న నమ్మకానికి ప్రతీకగా చెప్పుకోవడం ఆయన రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. 

పార్లమెంటరీ వ్యవహారాలపై ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా , అవిశ్వాస తీర్మానంలో కేవలం అవిశ్వాసం తప్ప, ఇతర అంశాలను ప్రస్తావించరన్న సంగతి తెలుసననీ, ఇటువంటి తీర్మానం సభలో ప్రతిపాదించినప్పుడు, ఆ రాజకీయ పక్షాలు, ప్రతిపక్షాలు తమ తమ కారణాలతో మద్ధతు పలుకుతాయన్న విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. తమిళనాడు సభ్యులు కావేరి విషయం, కాంగ్రెస్, వామపక్షాలు బిజెపికి వ్యతిరేకంగా అవిశ్వాసానికి మద్ధతు పలకడం సహజమన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాను ఎన్ డిఎ నుంచి బయటకు రావడం, అవిశ్వాసం పెట్టడం వల్లనే ఆ పార్టీలన్నీ మద్ధతు ప్రకటించాయని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నిజంగా చంద్రబాబునాయుడి పై ఈ పార్టీలకు అంత విశ్వాసం ఉంటే, ఇక్కడ రాష్ట్రంలో ప్రతిరోజూ ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు, ఉద్యమాలు ఎందుకు చేస్తాయని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజంగా ప్రజామోదం ఉంటే రోజూ ఎందుకు విమర్శలు గుప్పిస్తారని అడిగారు.

గతంలో అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించిన అంశంపై పార్లమెంటులో బిజెపి, కమ్యూనిస్టులు అవిశ్వాస తీర్మానం పెట్టాయని వాటిని మిత్రపక్షాలని చెపుతారా? అని పార్థసారథి నిలదీశారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే ఓటుకు నోటు కేసులోనూ, పోలవరంలో అనుసరిస్తున్న విధానాలకు, రాజధాని భూముల సేకరణకు, ఇసుక మట్టి  విధానాలు, భూ కేటాయింపులకు రాష్ట్రంలో కాంగ్రెస్ , వామపక్షాలు మద్ధతు తెలుపుతున్నారంటూ సిగ్గులేకుండా చెప్పుకున్నా ఆశ్చర్యం లేదని వ్యంగ్యంగా అన్నారు.  

నిన్నటి వరకు ఎన్డియే లో కొనసాగి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఒక్కసారి కూడా ప్రశ్నంచకపోగా, కనీసం చట్టాన్నిఅమలు చేయాలని అడగలేకపోయిన చంద్రబాబు, నాలుగేళ్లుగా అయిదు కోట్ల మంది ప్రజల తోడ్పాటుతో కొనసాగిస్తున్న పోరాటానికి తానే నాయకత్వం వహిస్తున్నాని చెప్పుకోవడాన్ని మించిన దౌర్భాగ్యం మరోటి లేదని మండిపడ్డారు. తనకు అందరూ సహకరిస్తున్నారంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు, రేపొద్దున్న యుపిఎ కు నాయకుడిని తానేనని చెప్పుకున్నా ఆశ్చర్యం లేదని పార్థసారథి అన్నారు. 

పవన్ ఆరోపణలపై సమాధానం ఏమిటి?

నాలుగేళ్లుగా మీ పార్టనర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ లేవనెత్తుతున్న అంశాలపై  సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలోని అవినీతి పైనా, 40 శాసనసభ్యులు తనకు అన్ని విషయాలు చెప్పారన్న దానిపై స్పందన ఏమిటన్నారు. రాష్ట్రప్రయోజనాలు తాకట్టపెట్టారని, మోసం చేశారనీ నీ పార్టనర్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే, చేసిన తప్పులపై పశ్చాతాపం ఉంటే, అఖిల సంఘాల సమావేశాన్ని ఎందుకు పిలవడం లేదు. కేంద్రంపై పోరాటం చేయాలన్న సంకల్పం ఉంటే, ఈ రోజు వరకు ఆ దిశలో ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు. 

జగన్ కేసుల గురించి చంద్రబాబు మాట్లాడటం చూస్తుంటే, ఆయనకు చట్టంపైనా, న్యాయస్థానాలపైనా గౌరవం లేదన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇప్పటికే తన చర్యలతో పార్లమెంటరీ వ్యవస్థపై నమ్మకం కోల్పోయిట్లుగా వ్యవహరించిన చంద్రబాబు, ప్రభుత్వానికి వత్తాసు పలికితే కేసులు కొట్టేస్తారన్నట్లుగా మాట్లాడటం అత్యంత దురదృష్టకరమన్నరు. రాజ్యాంగబద్ద వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయో అత్యంత అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. 
 నాలుగేళ్లుగా చంద్రబాబు ఆడినన నాటకాలు, చేసిన అవినీతి  భరతం పట్టడంనికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 
Back to Top