నెల్లూరు: తన కుటుంబ ఆర్థిక పరిస్థితి, తాను చేసే సేవా కార్యక్రమాలపై మేయర్ అబ్దుల్ అజీజ్ వ్యంగ్యంగా మాట్లాడడం బాధకరమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రాజకీయంగా విమర్శించడాన్ని తాను స్వాగతిస్తానని, తన ఆర్థిక స్థితిగతులు, సేవా కార్యక్రమాలపై ఎగతాళి చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ప్రజలకు చేసే సేవా కార్యక్రమాలపై విమర్శలు తగవన్నారు. మైనార్టీ విద్యాసంస్థ ఏర్పాటు, స్థల పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో ముందుకు రావాలని మేయర్‌కు సూచించారు. తనది మధ్యతరగతి కుటుంబమని సగర్వంగా చెప్పుకుంటానని, భగవంతుడు డబ్బులు ఇవ్వకపోయినా, ఆర్థికంగా బాగా స్థితివంతుడైన నన్ను ప్రేమించే మంచి తమ్ముడిని, మంచి స్నేహితులని ఇచ్చారన్నారు.
వారి సహకారంతో నా శక్తికి మించి ప్రజలకు ఉపయోగపడాలన్న ఆరాటాన్ని మేయర్ ఎగతాళి చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. మైనార్టీల ఆస్తుల పరిరక్షణ కోసం తనవంతు చేయూతనందించేందుకు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ సిద్ధంగా ఉన్నారన్నారు. మైనార్టీల కోసం రాజకీయాలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రూరల్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం పిచ్చే అయితే. ఆ పిలుపును పద్మశ్రీగా భావిస్తానని వివరించారు. ప్రజలకు సేవల విషయంలో రాజకీయాలు జరిగితే ఎవరితోనైనా పోరాడతానని స్పష్టం చేశారు.