సీట్లపై రాజకీయం చేయొద్దు

  •  బీసీలకు ఇచ్చిన మాటను జగన్‌బాబు నిలబెట్టుకుంటాడు: వైఎస్ విజయమ్మ
  •  నల్ల కాలువ వద్ద ఇచ్చిన మాట కోసమే ఇంత దూరం ప్రయాణించాడు 

‘‘మహానేత వైయస్­ రాజశేఖరరెడ్డి, ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి. ఆయన కుమారుడు జగన్, నల్లకాలువ వద్ద ఇచ్చిన మాట కోసం ఇంత దూరం ప్రయాణించాడు. నేను చెబుతున్నా.. బీసీలకు ఇచ్చిన మాటను జగన్‌బాబు తప్పకుండా నిలబెట్టుకుంటాడు. బీసీలకు ఎన్నికల్లో వంద టికెట్లు ఇవ్వడం కాదు.. వంద మంది బీసీలను శాసన సభకు పంపిద్దామనేది జగన్ ప్రతిపాదన. అన్ని పార్టీలూ దీనిని రాజకీయం చేయకుండా చిత్తశుద్ధితో బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నించాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. 

బీసీలకు వంద సీట్లివ్వాలని ప్రతిపాదించినందుకు ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో పలు సంఘాల నాయకులు బుధవారం విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకొని అభినందనలు తెలిపిన సందర్భంగా వారినుద్దేశించి ప్రసంగించిన విజయమ్మ వివిధ రాజకీయ పార్టీలకు ఈ విధంగా హితవు పలికారు. " వంద సీట్ల ప్రతిపాదన జగన్ కొత్తగా చెప్పలేదు. 2011లో స్థానిక ఎన్నికలు ప్రకటించినప్పుడే 33 శాతం స్థానాలను బీసీలకు కేటాయిద్దామని ప్రకటించారు " అని గుర్తు చేశారు. వైయస్‌ను ప్రశంసిస్తూ పలువురు నాయకులు చేసిన ప్రసంగాలకు విజయమ్మ స్పందిస్తూ.. "ఆయన మీ హృదయాల్లో ఇంతగా నిలిచిపోయారంటేనే ఆయన చేసిన మేలు ఎంతగా గుర్తుంచుకున్నారో అర్థమవుతుంది. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని వైయస్ మరణించే వరకూ పరితపించారు" అని చెప్పారు. 

ఈ ప్రతిపాదన చారిత్రకం : కృష్ణయ్య

బీసీలకు వంద స్థానాలు ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదన చారిత్రకమైనది, మహత్తరమైనదని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీలకు వంద టికెట్లు ఇస్తామని టీడీపీ ప్రకటిస్తే, విజయమ్మ ఓ అడుగు ముందుకు వేసి వంద మందిని అసెంబ్లీకి పంపిద్దామని చెప్పడం హర్షణీయమని చెప్పారు. ఈ ప్రతిపాదనను రాజకీయాలతో ముడి పెట్టకుండా అన్ని పార్టీలూ సానుకూలంగా స్పందించాలని కోరారు. బీసీల పట్ల వైయస్సార్ కాంగ్రెస్‌కు ఉన్న నిజమైన ప్రేమ, నిజాయతీ, అంకితభావం ఈ ప్రతిపాదనలో కనిపిస్తున్నాయని చెప్పారు. వంద స్థానాలను లాటరీ ద్వారా ఎంపిక చేయడమా లేక ఇతర పద్ధతిని అనుసరించాలా అనేది మేధావులు, కుల సంఘాలు, జర్నలిస్టులు కూర్చుని విస్తృతంగా చర్చించాలని సూచించారు. 

వైఎస్­ తీసుకున్న ప్రతిచర్యా బీసీలకు మేలు చేసినదే...

విజయమ్మ ప్రతిపాదనపట్ల రాష్ట్రంలోని బీసీ వర్గాలన్నీ ఆనందం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. తాను వైయస్ పక్షపాతినని చాలా మంది చెబుతుంటారని, అయితే వాస్తవంగా వైయస్ రాజశేఖరరెడ్డే బీసీల పక్షాన చేరారని కృష్ణయ్య అన్నారు. ఎందుకంటే.. వైయస్ తీసుకున్న ప్రతి చర్యా బీసీలకు మేలు చేసేదిగా ఉండేదని, విద్య, వైద్యం, ఆర్థిపరంగా బీసీలు పరిపుష్టం కావడానికి వైయస్ కృషి చేశారని చెప్పారు.

వైయస్ సంక్షేమ పథకాలనే ఎజెండాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పతాకంలో పేర్కొన్నది కనుక జగన్ కూడా వైయస్ స్ఫూర్తితో బీసీలు, బడుగులకు మేలు చేయాలని ఆయన కోరారు. వైయస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని, అది చారిత్రకమైనదని అన్నారు. ఈ పథకం ద్వారా గుడిసెలో నివసించే పేద పిల్లవాడు కూడా ఇంజనీరో, డాక్టరో కాగలిగాడని చెప్పారు.

వైయస్ హయాంలో హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను ఒకసారి 25 శాతం, మరోసారి 40 శాతం పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. 18 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలకు రుణాలను మాఫీ చేసిన ఘనత వైయస్‌దేనని చెప్పారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓరుగంటి వెంకటేశం (తెలంగాణ బీసీ సంఘం జేఏసీ), రాజేందర్ ముదిరాజ్ (రాష్ట్ర బీసీ హక్కుల పోరాట సమితి), ఉదయగిరి మురళి (రాష్ట్ర రజక సంఘం), అల్మెన్ రాజు (దక్షిణాది రాష్ట్రాల బీసీ సంఘం), జాజుల శ్రీనివాస్ గౌడ్ (బీసీ యువజన సంఘం), జి.శ్రీరమాదేవి (బీసీ సంక్షేమ సంఘం), అంగిరెల్లి నాగరాజు (బీసీ కులాల ఐక్య వేదిక), ర్యాగ రమేష్ (బీసీ విద్యార్థి సంఘం), గుజ్జ కృష్ణ (బీసీ ప్రజా సమితి), గొరిగె మల్లేశ్­ యాదవ్ (బీసీ ఫ్రంట్), ఎ.రామకోటి ముదిరాజ్ (బీసీ ఐక్య వేదిక), మల్లేశ్­ యాదవ్ (బీసీ సంఘర్షణ సమితి), గజేంద్రుల రవి (బీసీ యువజన సంఘం), మల్కచర్ల శ్రీనివాస్ (బీసీ విద్యార్థి సంఘం), ఎస్.వెంకట్ యాదవ్ (బీసీ మేధావుల ఫోరం), నీల వెంకటేశ్­ (బీసీ సేన), అశోక్ గౌడ్ (బీసీ న్యాయవాదుల సంఘం), ఎల్.ఎ.శివరామయ్య (బీసీ బలిజ సంఘం), సింగం నాగేశ్­ గౌడ్ (బీసీ ఫెడరేషన్), ఎ.ఆదిశేషుయాదవ్ (బీసీ సంఘం), డాక్టర్ శ్రీనివాసు (బీసీ హక్కుల పోరాట సమితి), జూడి విన్సెంట్ (దళిత క్రిస్టియన్), దండుగుల అశోక్ (వడ్డెర సంఘం యువజన విభాగం), మండల రామకృష్ణ (బోయ సంఘం), కూన దేవయ్య (మహేంద్ర సంఘం), ధర్మరాజు (వడ్డెర సంఘం), కె.రాజేశ్వరరావు (వీరభద్రాయి సంఘం), కాటపల్లి వీరస్వామి (వీరముష్టి సంఘం), అన్నం శివరాఘవయ్య (కృష్ణ బలిజ సంఘం) తదితరులు విజయమ్మను అభినందించారు.

రాష్ట్ర, జాతీయస్థాయిల్లో బీసీల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై విజయమ్మకు కృష్ణయ్య వినతిపత్రం సమర్పించారు.                       

 

Back to Top