క్షీణించిన సామినేని ఉదయభాను ఆరోగ్యం

జగ్గయ్యపేట (కృష్ణా జిల్లా),

5 అక్టోబర్ 2013: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా, సమైక్యాంధ్రకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ కృష్ణా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆరోగ్యం క్షీణించింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ జాతిపిత గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2న ఆయన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో నిరశన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

ఉదయభాను ఆరోగ్యం క్షీణించటంతో దీక్ష విరమించాలని శనివారంనాడు ఆయనను పరీక్షించిన వైద్యులు సూచించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు చే‌స్తున్న సమైక్య సత్యాగ్రహాలకు ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఇలా ఉండగా, శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభించిన 'సమైక్య దీక్ష'కు మద్దతుగా విజయవాడలో వంగవీటి రాధా దీక్ష చేపట్టారు.

కాగా.. విజయవాడ సెంట్రల్‌లో పి.గౌతంరెడ్డి, గన్నవరంలో దుట్టా రవిశంకర్, పెడనలో వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్ దీక్ష‌లు కొనసాగిస్తున్నారు. గొల్లపూడిలో కాజా రాజ్‌కుమార్ రిలే దీక్షలో పాల్గొన్నారు. బందరులో తాజా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని),‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కుక్కల నాగేశ్వరరావు, పలువురు మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, కార్యకర్తలు దీక్ష చేస్తున్నారు. గుడివాడలో తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

Back to Top