సమసమాజ స్థాపనే వైయస్ స్వప్నం: పువ్వాడ

ఖమ్మం:

సమసమాజాన్ని స్థాపించాలని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కలలు కనేవారని, ఆయనే పెద్ద కమ్యూనిస్టు అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. మండలంలోని ఎం. వెంకటాయపాలెంలో  వైయస్ఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం పార్టీ మండల కన్వీనర్ తోట చిన వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి కూడు, గూడు, గుడ్డ కల్పించడమే ధ్యేయంగా వైయస్ పని చేశారని కొనియాడారు. తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పేదల మన్ననలు పొందారని చెప్పారు. వైయస్ హయాంలో భూపోరాటాలు, పందేరాలు లేవని, జిల్లాలో గిరిజనులకు లక్ష ఎకరాల పోడు భూములను పంపిణీ చేయడమే దానికి కారణమని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పేదలకు 44 లక్షల పక్కా ఇళ్లు నిర్మించారని, రూ. రెండుకు కిలో బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపారని చెప్పారు. ఫీజు రియింబర్సుమెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ఘనత వైయస్‌దేనన్నారు. ఆరోగ్య శ్రీ పథకంతో లక్షల మంది పేదల ప్రాణాలు కాపాడి వారి గుండెల్లో కొలువయ్యారని చెప్పారు. అలాంటి సుభిక్ష పాలన మళ్లీ రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
చంద్రబాబుది దొంగ పాదయాత్ర : నరేష్‌రెడ్డి
వైయస్ఆర్ సీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి బయట ఉంటే తమ ఆటలు సాగవని టీడీపీ, కాంగ్రెస్, సీబీఐ కుట్ర పన్ని ఆయనను జైలు పాలు చేశాయని, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికార ంలోకి రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ రామసహాయం నరేష్‌రెడ్డి విమర్శించారు. అలాంటి దొంగ యాత్రలను ప్రజలు నమ్మరన్నారు. ‘మీ కోసం వస్తున్నా.. అనడం కంటే అధికారం కోసం చస్తున్నా..’ అనడం మేలని ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు తమ పార్టీ తరఫున షర్మిల ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారని, ఈనెల 18న యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. అంతకుముందు రెడ్డిపల్లిలో మారెమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పార్టీలో చేరిక...
గ్రామంలో పలు పార్టీల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు అజయ్‌కుమార్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ తోట రామారావు, యువజన విభాగం ప్రాంతీయ కో ఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ అయిలూరి మహేష్‌రెడ్డి, నాయకులు జిల్లేపల్లి సైదులు, మందడి వెంకటరెడ్డి, వెలటూరి ఉపేందర్, వాలూరి సత్యనారాయణ, ఎండపల్లి వెంకయ్య, చిన్నబోయిన లక్ష్మీనారాయణ, రాంలక్ష్మణ్, మంజ్యానాయక్, తుపాకుల వెంక న్న, నర్రా సైదులు, శ్యామల రాంరెడ్డి, విగ్రహ దాత సిరిపురం వెంకటేష్, బెల్లంపూడి బాబు, బేతంపూడి బాబు, గంగవరపు రత్నాకర్‌రావు, వీరెందర్, బేతంపూడి రాయుడు, మధు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top