దీక్ష విరమించేది లేదు: విజయమ్మ

గుంటూరు, 24 ఆగస్టు 2013:

కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేవరకు సమరదీక్షను కొనసాగిస్తానని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ స్పష్టంగా చెప్పారు. ప్రాణాలైనా వదులుతాను గానీ దీక్షను మాత్రం ఆపబోనని ఆమె తెగేసి చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి శ్రీమతి విజయమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేసి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి బలవంతంగా తరలించారు. అయితే, శ్రీమతి విజయమ్మ ఆస్పత్రిలో కూడా నిరాహారదీక్షను కొనసాగిస్తున్నారు. అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో శ్రీమతి విజయమ్మ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శనివారానికి ఆరవ రోజుకు చేరుకుంది. శ్రీమతి విజయమ్మ ఆరోగ్యం బాగా క్షీణించిన నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు శ్రీమతి విజయమ్మ గుంటూరు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. అమర్యాదకరంగా తనను ఆస్పత్రికి తరలించడంపై శ్రీమతి విజయమ్మ ఆస్పత్రిలో నేలపైనే కూర్చుని నిరసన వ్యక్తంచేశారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత సతీమణి, ఒక పార్టీకి గౌరవ అధ్యక్షరాలు, 58 ఏళ్ళు పైబడిన మహిళ, ఐదు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా శ్రీమతి విజయమ్మను పోలీసు వాహనంలో అమర్యాదకరంగా ఆస్పత్రికి తరలించారు. శ్రీమతి విజయమ్మ దీక్షను భగ్నం చేయడానికి డజన్ల కొద్దీ పోలీసు వాహనాల్లో వచ్చిన వారికి ఒక్క అంబులెన్సు కూడా తీసుకురాకుండా అవమానకరంగా ఆమెను పోలీస్ వ్యాన్లోనే తరలించారు. శిబిరం వద్ద ఉన్న ‌నాయకుల పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పార్టీ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు దీక్షా వేదికపై నుంచి ఎత్తి కిందికి విసిరేశారు.

శ్రీమతి విజయమ్మ ఐదు రోజుల నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్నందున విజయమ్మ ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రభుత్వ వైద్యులు చెప్పారు. తప్పనిసరిగా ఆమె ఫ్లూయిడ్సు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అయితే శ్రీమతి విజయమ్మ మాత్రం అందుకు నిరాకరిస్తున్నారు. ఆస్పత్రిలోనే ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు.

ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఉన్నారు. ఆస్పత్రి లోపలికి పోలీసులు  ఎవరినీ అనుమతించడంలేదు. కాగా, శ్రీమతి విజయమ్మను అవమానకర రీతిలో ఆస్పత్రికి తరలించిన వైనాన్ని విన్న అభిమానులు, గుంటూరు వాసులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. శ్రీమతి విజయమ్మను ఉంచిన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు వేలాది మంది తరలివస్తున్నారు.

Back to Top