రిషితేశ్వ‌రి మృతికి టీడీపీ కుల రాజ‌కీయాలే మూలం

గుంటూరు : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న‌లో రక్ష‌ణ క‌ర‌వైంద‌ని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డి మండి ప‌డ్డారు.  ఈ మేర‌కు మంగ‌ళ‌గిరిలోని ఆర్కే కార్యాల‌యం నుంచి ఒక ప్ర‌క‌ట‌న విడుదల అయింది. మాఫియా శ‌క్తులు చెల‌రేగిపోయి అధికారులు, ఉద్యోగుల మీద దాడులు చేస్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. కొంత కాలం క్రితం చంద్రబాబు విజ‌య‌వాడ‌లో స‌మావేశం పెట్టి, అధికారులంతా త‌మ కార్య‌క‌ర్త‌లు చెప్పినట్లుగా వినాల‌ని ఆదేశాలు జారీ చేశార‌ని, అప్పుడే ఇటువంటి ప‌రిస్థితి దాపురిస్తుంద‌ని తాము హెచ్చ‌రించిన‌ట్లు ఆయ‌న అన్నారు. దీని ఫ‌లిత‌మే అనేక చోట్ల తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు చెల‌రేగిపోయి ఉద్యోగుల మీద దాడులు చేస్తున్నార‌ని ఆయ‌న వివ‌రించారు.
ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వ‌రి మ‌ర‌ణానికి టీడీపీ వ‌ర్గాలు సాగిస్తున్న కుల రాజ‌కీయాలే కార‌ణ‌మని ఆర్కే అన్నారు. గ‌తంలో దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విశ్వ విద్యాల‌యాల్ని రాజ‌కీయాల‌కు దూరంగా ఉంచేవార‌ని ఆయ‌న గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే కొన్ని వ‌ర్గాలు రెచ్చిపోయి కుల రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఇటువంటి చెడు పోక‌డ‌ల్ని దూరం పెట్టాల‌ని ఆర్కే కోరారు.
Back to Top