బాబు దొంగ హామీలపై ప్రజలు తిరగబడ్డారు


ఆంధ్రప్రదేశ్, నవంబర్ 5: మాట తప్పిన ముఖ్యమంత్రిపై ప్రజలు తిరగబడ్డారు. మాయ మాటలు చెబుతున్న చంద్రబాబుపై మండిపడ్డారు. సర్కారు ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ఉద్యమించారు. ఇన్నికలప్పుడు ఇచ్చిన హామీల మేరకు రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను వెంటనే మాఫీ చేయాలని నినదించారు. వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతులు, డ్వాక్రా మహిళలు, పింఛనుదారులు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 661 మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించారు. దొంగ హామీలిచ్చిన దున్నపోతు ప్రభుత్వమా ఖబడ్దార్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలతో మండల కేంద్రాలన్నీ దద్దరిల్లాయి.

శ్రీకాకుళం జిల్లా సోంపేటలో మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజును పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో తహసీల్దారు కార్యాలయానికి తాళాలు వేసి పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా పాదయాత్రలో రైతుల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారని, ఇప్పుడు షరతులు విధిస్తున్నారని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు గురునాథరెడ్డి దుయ్యబట్టారు. ఇది ఆరంభం మాత్రమేనని చంద్రబాబు గద్దె దిగేవరకు ఉద్యమిస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో సాగు తీవ్ర సంక్షోభంలో ఉందని, మాట తప్పిన బాబును ప్రశ్నించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో కొనసాగడం కష్టమేనని, ఆయన ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.

కేసులు, రౌడీషీట్లకు భయపడి ఇళ్లల్లో కూర్చోమని, వైఎస్సార్ వారసులుగా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి తిరుపతిలో చెప్పారు. కొత్త రుణాలు లభించక పొదుపు మహిళలు ఇబ్బంది పడుతున్నారని, పొదుపు సొమ్మును కూడా బ్యాంకులు లాగేసుకుంటున్నాయని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిందేనని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం విస్మరించి ప్రజలను మోసగించాలని చూస్తే సహించేది లేదని, తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకూ రుణమాఫీ అయ్యేవరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని శాసనసభలో పార్టీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు.

చంద్రబాబు సర్కారు మెడలు వంచైనా రుణమాఫీ అమలు చేయించే వరకు తమ పార్టీ నిద్రపోదని జగ్గంపేటలో అసెంబ్లీలో శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ చెప్పారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంతవరకు పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు.

అన్ని జిల్లాల్లోనూ అదే హోరు...

ఎన్నికల హామీ మేరకు రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను తక్షణం మాఫీ చేయూలనే డిమాండ్తో వైఎస్సార్సీపీ నిర్వహించిన ఆందోళనలు అన్ని జిల్లాల్లోనూ విజయవంతమయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కన్వీనర్లు, నేతలు, పార్టీ శ్రేణులతో పాటు రైతులు, డ్వాకా మహిళలు భారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని మండల కార్యాలయాలను ముట్టడించడంతో పాటు వాటి ఎదుట ధర్నాకు దిగారు.అన్ని మండలాల్లోనూ సంబంధిత అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి ప్రభుత్వం దృష్టికి సమస్యను తేవాలని కోరారు.

Back to Top