రెండో రోజుకు చేరిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే దీక్ష


నెల్లూరు: రైతు దేశానికి వెన్నెముక. అటువంటి రైతు సాగు నీరందక పంటలు ఎండి దీనస్థితిలో ఉన్నాడు. వారిని ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నడుం బిగించారు. సాగు, తాగునీరు అందించటమే ప్రధాన లక్ష్యంగా ఉద్యమబాట పట్టారు. ప్రస్తుతం వేలాది ఎకరాల్లో పంటలు చివరి దశలో ఉన్నాయి. ఒక్క తడి పారితే పంటలు చూతికొచ్చే పరిస్థితి. ఎలాగైనా పంటలను చేతికందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిమూడు రోజుల పాటు నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. చివరి దశలో ఉన్న పంటలకు సాగునీరందించడంతో పాటు వేసవిలో తాగునీటి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. కావలి ఏరియా ఆస్పత్రి సెంటర్‌లో ప్రజలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో దీక్ష చేపట్టారు. కావలి వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయం నుంచి ఎడ్లబండిపై ర్యాలీగా దీక్షా వేదిక వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే పతాప్‌కుమార్‌రెడ్డికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కిలివేటి సంజీవయ్య, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, సీపీఎం నేతలు, రైతు సంఘం నాయకులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు, కళాకారులు సంఘీభావం తెలిపారు.
Back to Top