నాడు ఎన్‌టీఆర్‌కు.. నేడు టీడీపీకి వెన్నుపోటు...క‌ర్నూలు: సీఎం చంద్రబాబునాయుడు నాడు ఎన్‌టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి ఆయన దివంగతులయ్యేలా చేశారని వైయ‌స్ఆర్‌సీపీ క‌ర్నూలు పార్ల‌మెంట్ జిల్లా అధ్య‌క్షుడు  బీవై రామయ్య విమ‌ర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని  తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. ఆత్మగౌరవ నినాదంతో స్థాపించిన టీడీపీని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాళ్ల దగ్గర పెట్టి తెలుగువారి ఆత్మభిమానాన్ని చంపేశారన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు ఏమాత్రం విలువలు లేవని, కేవలం అధికారమే పరమాధిగా సాగుతున్నాయని విమర్శించారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి లేదని బీవై రామయ్య అన్నారు.   జిల్లాలో కోట్ల కుటుంబానికి విలువలు ఉన్నాయని, టీడీపీ ఇచ్చే ఒకటి, రెండు సీట్ల కోసం వాటిని దిగజార్చుకోవద్దని సూచించారు.

టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తులో ఎంపీ అవుతానని సూర్యప్రకాష్‌రెడ్డి కలలు కంటున్నారని, పొత్తులో పోటీ చేస్తే ఆయన చిత్తవడం ఖాయమన్నారు. 2014లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేయడంతో కొన్ని ఓట్లయినా పడ్డాయని, విలువలు లేకుండా రాజకీయాలు చేస్తే 2019లో ఆ ఓట్లు కూడా పడబోవని గుర్తించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన కాంగ్రెస్‌ పార్టీని 2014లోనే ప్రజలు తిరస్కరించారని, మళ్లీ ఆ పార్టీని ఆదరించే ప్రసక్తే లేదన్నారు.

తెలంగాణలో 13 సీట్లకే టీడీపీని పరిమితం చేసి రాహుల్‌గాంధీతో సీఎం చంద్రబాబునాయుడు వేదికను పంచుకోవడంపై సొంత పార్టీలోనే తీవ్ర నిరసన వ్యక్తమవుతోందన్నారు. ఆ రెండు పార్టీల పొత్తును ప్రజలు అంగీకరించడంలేదని, ఓటమి తప్పదని హెచ్చరించారు.  టీడీపీ–కాంగ్రెస్‌ పొత్తు ఉండే ప్రసక్తే లేదని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి,  కేఈ కృష్ణమూర్తి చెబుతూ వచ్చారని రామయ్య గుర్తు చేశారు. కేఈ కృష్ణమూర్తి.. ఏకంగా కాంగ్రెస్‌తో  టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకుంటానని ప్రకటించారన్నారు. కాంగ్రెస్, టీడీపీ అధ్యక్షులు చెట్టాపట్టాల్‌ వేసుకొని తిరుగుతున్నారని, ఒకే వేదికను పంచుకుంటున్నా.. తెలంగాణలో పొత్తు పెట్టుకున్నా.. వీరికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుంటాయని టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజు, మంత్రి యనమల రామకృష్ణుడు, రాహుల్‌గాంధీ దూతగా అమరావతికి వచ్చిన అశోక్‌గెహ్లాట్‌ ప్రకటించినా..వీరికి వినిపించలేదా అన్ని ప్రశ్నించారు. కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డికి దమ్ము ఉంటే టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు ఉండబోదని ప్రకటించాలని సవాల్‌ విసిరారు.  

అవినీతి సామ్రాట్‌ను సీఎం చేయాలనుకుంటున్నావా? 
టీడీపీ అధినేత అంత అవినీతి పరుడు దేశంలోనే లేరని గతంలో విమర్శించిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి.. టీడీపీతో పొత్తు అనగానే చంద్రబాబు నీతిమంతుడు అయ్యారా అని బీవై రామయ్య ప్రశ్నించారు. ఎక్కడైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార పక్షాన్ని విమర్శిస్తారని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విచిత్రమైన పరిస్థితి ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైనే ఆరోపణలు చేయడం కాంగ్రెస్, జనసేనతోపాటు కొన్ని పార్టీలకు అలవాటైందన్నారు.

వీరందరికీ ప్రజా సమస్యలపై ఏమాత్రం ధ్యాస లేదన్నారు. తమ పార్టీ అధినేత ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వంపై దండయాత్ర చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఏడాదిగా ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారన్నారు. ప్రతి రోజూ వేలాది మంది ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం కాకుండా అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయఢంకా మోగించి జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పొత్తులో ఎంపీ కావాలనుకుంటున్న కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కలలు కల్లలుగానే మిగిలిపోతాయని, ఆ రెండు పార్టీలను ప్రజలు ఛీ కొడతారన్నారు.  


Back to Top