రైతులకు రుణ మాఫీ పథకం ప్రవేశపెట్టాలి

హైదరాబాద్ 19 ఫిబ్రవరి 2013:

రైతులకు రుణ మాఫీ వర్తింపజేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ కోరారు. దేశ ఆహార భద్రత దృష్ట్యా ఇది అవసరమని పేర్కొన్నారు. ఈమేరకు ఆమె ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు మంగళవారం ఓ లేఖ రాశారు. మూడేళ్ళలో ఎరువుల ధరలు 150 నుంచి 300 శాతం పెరిగాయన్నారు. వరి మద్దతు ధర మాత్రం 25 శాతమే పెరిగిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. కూలీలు, ఎరువులు, విత్తనాల ధరలు అంతకంటే ఎక్కువగా పెరిగాయని లేఖలో వివరించారు. గతంలో ఇదే అంశంపై రాసిన లేఖల సారాంశాన్ని శ్రీమతి విజయమ్మ ఇందులో ప్రసావించారు. లేఖ పూర్తి పాఠం...

కిందటేడాది నవంబరు మొదటివారంలో రాష్ట్రంలోని తూర్పు కోస్తాను అతలాకుతలం చేసిన నీలం తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలకు నిధుల మంజూరు కోరుతూ అదేనెల 10న మీకు రాసిన లేఖను గుర్తుచేస్తున్నాను. దేశవ్యాప్తంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుకు రుణాలను మాఫీ చేయాలనీ కూడా అందులో విజ్ఞప్తిచేశాను.

'ఎరువుల ధరలు 200 శాతం పెరిగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇదే సందర్భంలో వరి మద్దతు ధర కేవలం 25 శాతమే పెరిగింది. ఈ పరిస్థితులలో వ్యవసాయం చేయడం కష్టంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగా 2009-10, 2010-11 ఆర్థిక సంవత్సరాలలో రైతులు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. 2011-12లో ఎరువుల ధరలు ఊహాతీతంగా పెరిగాయి. ఈ కారణంగా ఇంచుమించు రైతన్నలందరూ అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో రుణ మాఫీ పథకం ప్రకటించాలి'.

     కేంద్ర ప్రభుత్వం ధాన్యం మద్దతు ధరను క్వింటాలు 2012-13 సంవత్సరానికి వెయ్యి రూపాయల నుంచి 1250కి పెంచిదనడంలో ఎటువంటి సందేహమూ లేదు. గడిచిన మూడేళ్ళలో ఇరవై ఐదు శాతం పెరిగింది. కానీ, ఇదే కాలంలో విత్తనాలు, ఇంధనం, ఎరువులు ధరలు, కూలీలకు చెల్లించాల్సిన మొత్తం, ద్రవ్యోల్బణం ఎన్నోసార్లు అధికమయ్యాయి. ఈ కారణంగా వ్యవసాయం చేయలేని స్థితి నెలకొంది.

     కిందటేడాది డిసెంబరు 14న నేను మీకు రాసిన మరో లేఖలో గడిచిన రెండేళ్ళలో ఎరువుల ధరలు ఏరకంగా పెరిగిందీ వివరించాను. వాటిని తగ్గించాల్సిన అవసరాన్ని కూడా మీ దృష్టికి తెచ్చాను. 2010 నుంచి 2012కు వివిధ ఎరువులు ఇలా పెరిగాయి.  యూరియా బస్తా 250 ఉంటే 2012లో 300రూపాయలయ్యింది. డీఏపీ 500 నుంచి 1250కి పెరిగింది. ఎన్పీకే 17-17-17రకం 425నుంచి 1175కి పెరిగింది. ఎన్పీకే 10-26-26రకం 400నుంచి 1200 అయ్యింది. ఎమ్ఓపీ  200 నుంచి 225 వరకూ ఉండేది 1000 రూపాయలకు పెరిగింది. డీఏపీ నూటయాబై శాతం, ఎన్పీకే ధర రెండు వందల శాతం ఎక్కువయ్యాయి. ఎమ్ఓపీ ధర మూడు వందల శాతం పెరిగింది. వీటి ధరల పెరుగుదల ఊహాతీతంగా ఉంది.

      1981-91 దశాబ్దంలో 5.2% ఉన్న వ్యవసాయాభివృద్ధి 1991-2001 మధ్య 2.2% పడిపోయిన విషయం మీరు గమనించే ఉంటారు. 1998-2010 మధ్య కాలంలో ఎన్డీయే, యూపీయే ప్రభుత్వాలు నాలుగు శాతం వృద్ధిని నిర్దేశించుకున్నప్పటికీ అది 2.5 శాతానికి పరిమితమైంది.  జనాభాలో 70శాతం మంది వ్యవసాయంపై ఆధారపడిన మన దేశంలో నెలకొన్న ఈ నేపథ్యం వ్యవసాయదారుల ఆదాయాన్ని గణనీయంగా తగ్గించింది.  1990 దశకంలో దేశంలోని 630 జిల్లాల్లో కేవలం 15 జిల్లాలు మావోయిస్టుల ప్రాబల్యం ఉండేది. ఇప్పుడది 150 జిల్లాలకు వ్యాపించింది. డాక్టర్ ఎమ్.ఎస్. స్వామినాథన్ నేతృత్వంలోని రైతు కమిషన్ సూచించిన సిఫార్సులను అమలుచేస్తే గ్రామాల వెతలను అదుపుచేయవచ్చు.
రైతులు, చేతివృత్తుల వారి అవసరాలు, దేశ ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణం రుణ మాఫీ పథకాన్ని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తున్నాను. తరచూ ఎరువుల ధరల పెరుగుదల నుంచి రైతును రక్షించడానికీ, మద్దతు ధర పెంపుపై ఓ విధానం రూపొందించడానికి వీలుగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాను.

                                    ధన్యవాదాలతో
                                    వైయస్ విజయమ్మ
                                                 గౌరవాధ్యక్షురాలు
                                             వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Back to Top