చిన్న వర్షానికే అసెంబ్లీ అతలాకుతలం

  • బయటపడిన బాబు డొల్లతనం
  • ప్రతిపక్ష నేత ఛాంబర్ లోకి వర్షపు నీరు
  • అనాలోచితంగా క‌ట్టిన ఫ‌లిత‌మే ఇది
  • శాస‌న మండ‌లి ప‌క్ష నేత ఉమ్మారెడ్డి
అమ‌రావ‌తి:  రాజ‌ధాని నిర్మాణానికి ఈ ప్రాంతం అనుకూలం కాద‌ని ఎందరు చెప్పినా విన‌కుండా చంద్ర‌బాబు అనాలోచితంగా క‌ట్టిన ఫ‌లితంగానే ఇవాళ అసెంబ్లీలోకి నీరు వ‌చ్చింద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాస‌న మండ‌లి ప‌క్ష నేత ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు అన్నారు. ఏపీ అసెంబ్లీలోని ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఛాంబ‌ర్‌లోకి వ‌ర్షం నీరు చేరి, పైక‌ప్పు ఫ్లెక్సీలు ఊడిపోవ‌డం ప‌ట్ల ఉమ్మారెడ్డి స్పందించారు. తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం తీరును ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. కొండ‌వీటి వాగు ముంపు ఉంటుంద‌ని శివ‌రామ‌కృష్ణ క‌మిటీ కూడా ముందే చెప్పింద‌ని తెలిపారు.  ఇక్క‌డ బిల్డింగ్ క‌ట్ట‌డానికి వీలుప‌డ‌ద‌ని గ్రీన్ ట్రిబ్యూన‌ల్ కోర్టు చెప్పినా ఖ‌త‌రు చేయ‌లేదని గుర్తు చేశారు. ఇటీవ‌ల జాతీయ మ‌హిళా స‌ద‌స్సు నిర్వ‌హించిన సంద‌ర్భంలో కూడా వ‌ర్షం కుర‌వ‌డంతో తాత్కాలిక స‌చివాల‌యానికి రాక‌పోక‌లు నిలిచిపోయాయ‌ని తెలిపారు. మ‌హిళ‌లు బ‌య‌ట‌కి వెళ్ల‌లేద‌ని చెప్పారు. ఐదు బ్లాక్‌లు క‌లిసి రూ.1300 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని, ఒక్క వ‌ర్షానికే అసెంబ్లీ మునిగిపోయింద‌న్నారు. ప్ర‌తిప‌క్ష నేత చాంబ‌ర్ నీట మునిగింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.ప‌ర్మినెంట్ బిల్డిండ్ క‌ట్టే వ‌ర‌కైనా ఇది ఉండాలి క‌దా అని నిల‌దీశారు. ప్ర‌జ‌ల డ‌బ్బు మంచినీళ్ల‌లా ఖ‌ర్చు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఆరు నెల‌ల్లో పూర్తి చేసే ప‌నికిరాని బిల్డిండ్ ఎవ‌రికి కావాలని ఉమ్మారెడ్డి ప్ర‌శ్నించారు. అనాలోచితంగా క‌ట్టిన ఫ‌లిత‌మే ఇవాళ ఇలాంటి సంఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని, దీనికి  చంద్ర‌బాబు ఏం స‌మాధానం చెబుతారో చూద్దామ‌న్నారు.
--------------------------
చంద్ర‌బాబు అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు
వైయ‌స్ ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ‌
అమ‌రావ‌తి:  ఒక్క వ‌ర్షానికే తాత్కాలిక స‌చివాల‌యంలోకి నీరు చేరాయంటే ఇందులో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థ‌మ‌వుతుంద‌ని, రాజ‌ధాని పేరుతో చంద్ర‌బాబు చేస్తున్న అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు అయ్యింద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ అన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ఛాంబ‌ర్‌లోకి వ‌ర్షం నీరు చేర‌డంపై వాసిరెడ్డి ప‌ద్మ ప్ర‌భుత్వ తీరును త‌ప్పుప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆమె విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. 
చంద్ర‌బాబు బండారం ఒక్క వ‌ర్షంతోనే బ‌య‌ట‌ప‌డింది. ఒక్క వ‌ర్షానికి బ‌క్కెట్ల‌తో నీళ్లు తోడుకోవాల్సిన దుస్థితి నెల‌కొంది. ఇప్ప‌టికి కూడా క‌ప్పిపుచ్చుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మీడియాను అనుమంతించ‌కుండా ప్ర‌భుత్వం మ‌భ్య‌పెడుతోంది. ఇది రాష్ట్రానికి అవ‌మాన‌క‌రం. ఇది చంద్ర‌బాబు సొమ్ము కాదు క‌దా. ప్ర‌జ‌ల డ‌బ్బుతో క‌ట్టిన బిల్డింగ్ ఇలా ఉంటే ప‌రిస్థితి ఎంటి. శివ‌రామ‌కృష్ణ క‌మిటీ నివేదిక‌ను బుట్ట‌దాఖ‌లు చేశారు. ఇక్క‌డ కేంద్రం త‌ప్పిందం కూడా ఉంది. అసెంబ్లీ నిర్మాణం విష‌యంలో కేంద్రం ప‌ట్టించుకోలేదు. బుడిద‌లో పోసిన ప‌న్నీరులా మారింది. ఇందులో ఎంత అవినీతి జ‌రిగిందో అర్థ‌మ‌వుతోంది. ఎందుకు అంద‌రి అభిప్రాయాలు ప‌ట్టించుకోవ‌డం లేదు. చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలి. న‌వ నిర్మాణ దీక్ష‌ల‌తో కేంద్రం గొంతు కోసింద‌ని చంద్ర‌బాబు పేర్కొంటున్నారు. మీరేందుకు ప్ర‌జ‌ల గొంతు కోస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఇంక చంద్ర‌బాబును కాపాడుదామ‌నే ప్ర‌య‌త్నం చేయ‌కుండా మీడియా ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని వాసిరెడ్డి ప‌ద్మ కోరారు.
Back to Top