రైల్వే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

నెల్లూరు:  రైల్వే సమస్యలను పరిష్కారానికి చొరవ చూపాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రైల్వే జోనల్ మేనేజర్ రవీంద్రగుప్తాను కోరారు. హైదరాబాద్‌లోని రైల్వే జోనల్‌మేనేజర్‌తో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఎంపీ మేకపాటి మాట్లాడుతూ  నెల్లూరు ప్రదాన రైల్వే స్టేషన్‌తో పాటు దక్షిణ స్టేషన్, పడుగుపాడు, వేదాయపాళెం, కావలి, బిట్రగుంట, ఉలవపాడు రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికులు అవసరమైన పలు ప్రతిపాదనలు చేసినట్లు పేర్కొన్నారు. నెల్లూరు-తిరుపతి, నెల్లూరు-చెన్నైకి నిత్యం ఎంతో మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. 

ముఖ్యంగా సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళల్లో మార్పులు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న వేళలతో ప్రయాణికులకు చాలా ఇబ్బంది కరంగా ఉందన్నారు. అక్టోబర్‌లోపు సింహపురి వేళల్లో మార్పులు తీసుకొస్తే ప్రయాణికులకు ఉపయోగంగా ఉంటుందన్నారు. నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లకు దక్షిణంవైపు రైల్వేకు సంబంధించి దాదాపుగా ఎకరా స్థలం ఉందన్నారు. ఈ ప్రదేశంలో రైల్వే మల్టిప్లెక్స్ కట్టిస్తే రైల్వేకు కూడా ఆదాయం వస్తుందన్నారు.

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెము రైళ్లను పెంచితే ఉపయోగంగా ఉంటుందన్నారు. నెల్లూరు నుంచి సుదూర ప్రాంతాలకు  వ్యాపారులు, విద్యార్థులు ప్రయాణాలు సాగిస్తున్నారన్నారు. వీరి కోసం నెల్లూరు స్టేషన్‌లో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపితే రైల్వేకు ఆదాయంతో పాటు ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. స్పందించిన జోనల్ మేనేజర్ జిల్లాలోని రైల్వే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ పేర్కొన్నారు.
Back to Top