రఘువీరాపై షర్మిల మండిపాటు


సొమ్మొకడిది.. సో కొకడిదిలా వ్యవహరిస్తున్న మంత్రి
అప్రాచెరువు:

మహానేత తనయ షర్మిల రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డిపై  మండిపడ్డారు. మరోప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం సాయంత్రం అనంతపురం జిల్లా అప్రా చెరువు చేరుకుంది. హంద్రీ నీవా అంశంలో రఘువీరారెడ్డి సొమ్మొకడిది.. సోకొకడిదిలా వ్యవహరిస్తున్నారని షర్మిల ఆరోపించారు.  వైయస్ హయాంలో హంద్రీనీవా మొదటి దశ  95 శాతం పూర్తయ్యిందనీ, మిగిలిన అయిదు శాతం పనికి పాదయాత్ర అంటూ రఘువీరా బిల్డప్ ఇస్తున్నారనీ ఎద్దేవా చేశారు. గత మూడేళ్ళలో ఈ ప్రభుత్వం రూ. 45 కోట్లు విడుదలచేయలేదన్నారు. పీబీఆర్ ప్రాజెక్టుకు వైయస్ఆర్ పది టీఎంసీల నీరు కేటాయిస్తే ఈ ప్రభుత్వం దానిని ఎందుకు రద్దు చేసిందని ఆమె ప్రశ్నించారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం మొద్దునిద్ర పోతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు తమ కుర్చీలను కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నారనీ, ప్రజాసమస్యలు వారికి పట్టడం లేదనీ షర్మిల వాపోయారు. జగన్ విషయంలో ప్రభుత్వం ప్రతిపక్షం ఒక్కటయ్యయని ఆరోపించారు. 108కి ఫోన్ చేసినా రావడం లేదని ఆప్రాచెరువు గ్రామస్థులు ఆరోపించారు. ఫీజు రీయంబర్సుమెంట్ పథకం సందిగ్ధంలో పడిందని పేర్కొన్నారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని టమాటా రైతులు ఆమె దృష్టికి తెచ్చారు. రామరాజ్యం వస్తుందనీ, కంగారు పడవద్దనీ ఆమె వారికి ధైర్యం చెప్పారు. అప్రాచెరువులో షర్మిలకు ప్రజలు పెద్ద సంఖ్యలో స్వాగతం చెప్పారు.

Back to Top