హైదరాబాద్, 26 సెప్టెంబర్ 2012: పెంచిన ఆర్టీసీ చార్జీలు, విద్యు సర్‌చార్జీలను తక్షణమే ఉపసంహరించాలంటూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారంనాడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించిన ఆందోళనలు హోరెత్తాయి. ధర్నాలు, రాస్తారోకోలు, కలెక్టరేట్‌ల ముట్టడిలతో పార్టీ శ్రేణులు ఉవ్వెత్తున ఉద్యమించారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ జిల్లాల కన్వీనర్లు ఆదం విజయ్‌కుమార్, బి.జనార్దన్‌రెడ్డి తదితరుల నేతృత్వంలో ఆందోళనలు జరిగాయి. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పార్టీ మైనార్టీ నాయకుడ మాజీ ఎమ్మెల్సీ హెచ్‌ఎ రెహ్మాన్, రాష్ట్ర సేవాదళం కన్వీనర్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ధర్నాలో పార్టీ నాయకురాలు పి. విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పజలపై రోజుకో రూపంలో భారం మోపుతున్న ప్రభుత్వంపై వారంతా తీవ్రంగా విరుచుకుపడ్డారు.<br/>దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అటకెక్కించిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చార్జీల పెంపుతో ప్రజలను చావబాదుతోందని ధ్వజమెత్తారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. వైయస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ బి.జనార్దన్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. వైయస్‌ఆర్ సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ వంగపండు ఉష తదితరులు పాల్గొన్నారు.<br/>వైయస్‌ఆర్ జిల్లా కేంద్రం కడపలో పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున మహా ధర్నా నిర్వహించారు. పెంచిన బస్సు చార్జీలు వెంటనే ఉపసంహరించాలని వారు నినాదాలు చేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత, జిల్లా నాయకులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహానేత వైయస్ మరణించిన తరువాత వచ్చిన రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు మూడు సార్లుగా నూరు శాతం చార్జీలను పెంచిందని దుయ్యబట్టారు. వైయస్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి చోద్యం చూస్తున్నాయని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని పెంచిన చార్జీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రామకృష్ణారెడ్డి, సుచరిత కూడా ఈ సందర్భంగా మాట్లాడారు.<br/>విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అంటూ ఉన్నదన్న విషయాన్నే ప్రజలు మర్చిపోయారని రామకృష్ణ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. డీజిల్ ధర పెరిగిన కారణంగా రాష్ట్రానికి రూ. 500 కోట్ల ఆదాయం అదనంగా వస్తుందన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిత తరువాత ఇంతటి అసమర్ధ ప్రభుత్వాన్ని చూడలేదని దుయ్యబట్టారు. విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోని ఈ ప్రభుత్వం చార్జీలు పెంచేసిందని విమర్శించారు.