రాష్ట్రపతితో విజయమ్మ భేటీ

హైదరాబాద్, 15 జనవరి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి కేసులో సీబీఐ అనుసరిస్తున్న తీరుకు నిరసనగా సేకరించిన సుమారు 2 కోట్ల సంతకాలను పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాల్లో ఉన్నపార్టీ శ్రేణులు, మహానేత అభిమానుల నుంచి నెల రోజులపాటు సంతకాలు సేకరించారు. శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి కేసులో సీబీఐ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ప్రజలు తమ అభిప్రాయాన్ని సంతకాల రూపంలో తెలియజేశారు.

     'జగన్ కోసం... జనం సంతకం' పేరుతో సేకరించిన సుమారు రెండు కోట్ల సంతకాలను సీడీల్లోకి మార్చారు. ఆ సీడీలను శ్రీమతి వైయస్ విజయమ్మ రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి అపాయింట్ ఇవ్వగానే శ్రీమతి వైయస్ విజయమ్మ మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లారు. శ్రీమతి విజయమ్మతోపాటు పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, తదితరులు ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో రాష్ట్రపతితో శ్రీమతి విజయమ్మ బృందం భేటీ అయింది.

Back to Top