రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచండి

హైదరాబాద్: సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ప్రధాన మంత్రిని కలిశారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు గురువారం ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో ఈ సంఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇంకెంతో దూరంలో లేదని చెబుతూ వస్తున్న కేసీఆర్, 15రోజుల్లో ప్రకటన వెలువడుతుందని ఇటీవలే తెలిపారు. ముగియనున్న పార్లమెంటు సమావేశాలకు హాజరవడానికి ఆయన ఢిల్లీ చేరుకున్న వెంటనే ఎంపీలు ప్రధానిని కలిశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా గురువారం రాత్రి ఢిల్లీకి చేరడంతో తెలంగాణ అంశంపై అధిష్ఠానం ఓ నిర్ణయం తీసుకోనుందనే ఊహాగానాలు మొదలయ్యయి. 
అదేరోజు ప్రధానిని కలిసిన సీమాంధ్రకు చెందిన పదిమంది ఎంపీలు ఆంధ్ర ప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని  ముక్తకంఠంతో  కోరారు. అందువల్ల రాష్ట్రంలోని మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని ఆయనకు వివరించారు. స్వాతంత్ర్యానంతరం రాష్ట్రం సాధించిన అభివృద్ధిని వారు వివరించారు. రాష్ట్ర విభజన జరగదని ప్రకటన వెలువడిన అనంతరం, కాంగ్రెస్ ఎంపీలంతా పార్టీ బలోపేతానికి నడుం బిగిస్తారనీ, ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం వెలువడుతుందో తెలియక అసందిగ్ధ స్థితిలో ఉన్నారనీ వారు ప్రధానితో చెప్పారు. కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండేలను కూడా కలిసి ఇదే అంశాన్ని విన్నవించారు. తమ విజ్ఙప్తికి కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. విదేశాలనుంచి సోమవారం తిరిగి రానున్న అధినేత్రి సోనియా గాంధీని కూడా కలిసి సమైక్యంగానే ఉంచాలని కోరాలని వారు నిర్ణయించుకున్నారు.  ఎంపీలు కావూరి సాంబశివరావు, కిల్లి కృపారాణి, అనంత వెంకట్రామిరెడ్డి, తదితరులు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు.

Back to Top