రాజన్న రుణం తీర్చుకోవాలనుకుంటున్నారు

గుంతకల్లు:

‘చెడుపై మంచి సాధించిన విజయాలకు చిహ్నంగా దేవీ నవరాత్రులు చేస్తారు. ప్రతిపక్ష టీడీపీతో కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న దుష్టపాలనను ఎదుర్కోవడానికి జననేత వైయస్ జగన్ దేవీనవరాత్రుల నాడు సంధించిన బ్రహ్మాస్త్రమే షర్మిల’ అని వైయస్ఆర్ కాంగ్రెస్ గుంతకల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి  వై. వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం గుంతకల్లు పట్టణంలోని పొట్టి శ్రీరాములు సర్కిల్‌లో ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మహానేత వైయస్  అమలు చేసిన ఫీజు రీయింబర్సుమెంట్ ద్వారా ఎంతోమంది ఉన్నత చదువులు చదివి... ప్రస్తుతం మంచి ఉద్యోగాలు చేసుకుంటూ సమాజంలో ఉన్నతంగా జీవిస్తున్నారన్నారు. రీయింబర్సుమెంట్ ద్వారా లబ్ధిపొందుతున్న విద్యార్థులంతా రాజన్న రుణం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టడానికి వారు నడుం బిగించారని తెలిపారు. మహానేత ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి పేదల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారని కొనియాడారు. మహానేత ఆశయాల సాధన ఒక్క జగన్మోహన్‌ రెడ్డితోనే సాధ్యమన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న జనాదరణ చూసి కాంగ్రెస్,  టీడీపీల్లో వణుకు మొదలైందన్నారు. అందువల్లే జగన్‌ను అణగదొక్కడానికి నీచాతినీచమైన చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. గుంతకల్లు పట్టణంలోని మిల్లు ఆస్తులను తక్కువ ధరకు కొట్టేయడానికి అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బుధవారం జరిగిన షర్మిల యాత్రను విఫలం చేయడానికి కొంత మంది తీవ్రంగా ప్రయత్నించారన్నారు. అందులో భాగంగానే తాగునీరు రాకుండా చేశారని ధ్వజమెత్తారు.

‘అనంత’ మనవరాలికి ఘనంగా
వీడ్కోలు పలుకుదాం..

పాదయాత్రలో భాగంగా గుంతకల్లు నియోజకవర్గానికి విచ్చేసిన అనంతపురం జిల్లా మనవరాలు షర్మిలమ్మకు ఘనంగా వీడ్కోలు పలకడానికి పెద్దసంఖ్యలో కదలిరావాలని వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. పాదయాత్ర గురువారం మధ్యాహ్నం కసాపురం నుంచి కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుందని, ఆ సందర్భంగా షర్మిలమ్మకు ఘనంగా వీడ్కోలు పలుకుదామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Back to Top