రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి ఊడబెరుకుతావా

  • బాబుది నాలుకా... తాటి మట్టా?
  • కాంట్రాక్టు లెక్చరర్స్‌పై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం
  • బాబు ప్రతిపక్షంలో ఓ మాట, అధికారంలో ఓ మాట
  • లెక్చరర్స్‌ దీక్షకు వైయస్‌ఆర్‌ సీపీ పూర్తి మద్దతు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి
హైదరాబాద్‌: ఎన్నికల ముందు వందల కొద్ది హామీలిచ్చి అధికారంలో వచ్చిన తరువాత అమలు చేయని చంద్రబాబుది నాలుకా.. లేక తాటిమట్టా? అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. బాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆమరణ నిరాహారదీక్షలు చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్స్‌కు నోటీసులు ఇప్పించి, పోలీసులతో వారిపై కేసులు పెట్టించే దుర్మార్గపు చర్యను బత్తుల తీవ్రంగా ఖండించారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బత్తుల మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ద్వంద్వవైఖరిపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కాంట్రాక్టు లెక్చరర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాల్సింది పోయి వారి ఉద్యోగాలను ఊడబెరికి తనకు అనువైనవారికి కట్టబెట్టాలని చూడడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చి ఆశలు కల్పించిన వాస్తవాలు మర్చిపోయారా.? మీరిచ్చిన హామీలకంటే ఎక్కువగా వారు ఏమైనా అడిగారా? అని బాబును నిలదీశారు.  ఏ ఉద్దేశ్యంతో నోటీసులు జారీ చేశారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను తీసేయాలనే ఆలోచన దేశంలో ఏ నాయకుడికి రాదు ఒక్క చంద్రబాబుకు తప్ప అని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక లక్షా 75 వేల నుంచి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించారా అని చంద్రబాబును నిలదీశారు. 

బాబుది ద్వంద్వ వైఖరి
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ విధంగా, అధికారంలో ఉన్నప్పుడు మరోవిధంగా ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారని బత్తుల మండిపడ్డారు. 2012 ఫిబ్రవరి 10వ తేదిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు లెక్చరర్స్‌ను పర్మినెంట్‌ చేయాలని రాజమండ్రిలో దీక్ష శిబిరాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు గుర్తులేని విషయం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే గుర్తుంటుందా అని ప్రశ్నించారు. అంతేకాకుండా గతంలో అధికారంలో ఉన్నప్పుడు నియంతృత్వ ధోరణితో అంగన్‌వాడీల అన్యాయంగా తొలగించి తన పార్టీకి పాకా ఊదే వారిని నియమించుకున్నారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించి రూ. 18,500 నుంచి 20 వేల వరకు భృతి కల్పిస్తున్నట్లు జీవో కూడా విడుదల చేసిన విషయం గుర్తు చేసుకోవాలని చంద్రబాబుకు సూచించారు.  వైయస్‌ఆర్‌ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఒక్కరి ఆర్థిక సంపత్తి కోసం బాటలు వేస్తే చంద్రబాబు మాత్రం ఎన్నికల పూట ఇచ్చిన హామీని నెరవేర్చకుండా దౌర్జన్యంగా పోలీసులతో నిరసన తెలిపే వారిపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 కాంట్రాక్టు ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా... ఆ ఆదేశాలను కూడా అమలు చేయరా అని నిలదీశారు. 48 గంటల నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నవారిని తొలగించాలని దొడ్డి దారిన వారు పనిచేసే కళాశాల ప్రిన్సిపల్స్‌కు ఆదేశాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ వారికి చేయూతనిస్తూ వారికి ఉద్యోగ భద్రత కల్పించడానికి భరోసా కల్పిస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వంపై పోరాటం చేసే ప్రతి ఒక్కరికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు పబ్లిసిటీకి వేల కోట్లు ఖర్చు పెట్టడం మానుకొని ప్రజలకు మేలు చేసే విధంగా పరిపాలన చేయాలని సూచించారు.

 
Back to Top