ప్రతి పేదవాడికీ సొంతిల్లు.. వైయస్ సంకల్పం

సల్కాపురం (కర్నూలుజిల్లా), 20 నవంబర్‌ 2012: రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ సొంత ఇల్లు ఉండాలని దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి కలగన్నారని షర్మిల పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రజాసంక్షేమాన్ని మరచిపోయారని దుయ్యబట్టారు. సరైన సమయంలో విద్యుత్‌ను కొనుగోలు చేయకుండా కిరణ్‌కుమార్‌ రెడ్డి మొద్దు నిద్ర పోతుండడం వల్లే రాష్ట్రంలో కనీసం కరెంటు అవసరాలు కూడా తీరకుండా తీవ్ర సంక్షోభం ఏర్పడిందని ఆమె ఆరోపించారు. ప్రజల ఆదరాభిమానాలే అండగా కాంగ్రెస్‌, టిడిపి కుమ్మక్కు రాజకీయాల నుంచి జగనన్న బయటపడతారని, రానున్న ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. జగనన్న అధికారంలోకి రాగానే సల్కాపురం ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రాజన్న రాజ్యంలో వైయస్ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేసి చూపిస్తామని ‌భరోసా ఇచ్చారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున రాష్ట్రంలో మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న షర్మిల 34వ రోజు కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల సల్కాపురంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. రచ్చబండ కార్యక్రమంలో సల్కాపురం గ్రామస్థులు షర్మిల ముందు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. వారి బాధలన్నింటినీ శ్రద్ధగా విన్న షర్మిల పై విధంగా స్పందించారు.

సల్కాపురం ప్రజలు తమ సమస్యలను షర్మిలకు మొర పెట్టుకుంటూ విద్యుత్‌ సరఫరా ఆరు గంటలే చేస్తున్న ప్రభుత్వం బిల్లులు మాత్రం 400 రూపాయలు వసూలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బిల్లులు కట్టలేకపోతే పోలీసులు తమ ఇళ్లకు వచ్చి వేధిస్తున్నారని విలపించారు. వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికీ బిల్లులు ఇవ్వడం లేద‌ని వారు వాపోయారు. పావలా వడ్డీ రుణాలకు కూడా రెండు రూపాయల వడ్డీని బలవంతంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వైయస్‌ మంజూరు చేసిన పింఛన్లను కూడా రద్దు చేశారని వారు చెప్పారు. విద్యార్థులకు రీయింబర్సుమెంట్ రావడం లేదని, ఉపకార వేతనాలు అసలే వేవని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద తమకు నెలకు 20 రోజులు మాత్రమే పని ఇచ్చి, దానికి ఇవ్వాల్సిన కూలీ కూడా కేవలం 30 రూపాయల చొప్పున ఇస్తున్నారని చెప్పారు. తమ పంట ఉత్పత్తులను అమ్మబోతే తక్కువ ధర కడుతున్నారని, తాము కొనబోతే విపరీతమైన ధర చెబుతున్నారని సల్కాపురం రైతులు షర్మిల వాపోయారు.

షర్మిల స్పందిస్తూ, ఆరోగ్యశ్రీని, ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. మహానేత వైయస్‌ ప్రారంభించిన పథకాలను రాజన్నరాజ్యంలో సమర్థంగా అమలు చేస్తామని సల్కాపురం ప్రజలకు షర్మిల భరోసా ఇచ్చారు. జగనన్న వస్తే రైతన్న తల ఎత్తుకుని తిరిగేలా పాలన చేస్తారన్నారు.
పాదయాత్ర చేస్తూ తమ గ్రామాలకు వస్తున్న షర్మిలతో కరచాలనం చేయడానికి ఆయా గ్రామాల ప్రజలు పోటీలు పడుతున్నారు. షర్మిల అడుగులో అడుగు వేసి నడవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఒక బాలుడు తన పుట్టినరోజు వేడుకను షర్మిల సమక్షంలో నిర్వహించుకోవడం ఆసక్తి కలిగించింది.

Back to Top