రాప్తాడులో సర్కారీ వేట!

అనంతపురం: అనంతపురం మరోసారి రక్తసిక్తమైంది. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాప్తాడు మండల నేత భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి(49)పై రాజకీయ ప్రత్యర్థులు వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి నరికి చంపారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలోని ఆర్‌ఐ చాంబర్‌లోనే ప్రసాదరెడ్డి ఉసురు తీశారు. సాక్షాత్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో జరిగిన ఈ ఘటన వెనుక ప్రభుత్వంలోని పెద్దల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది.

హత్య జరిగిన ప్రాంతం రెవెన్యూ కార్యాలయంలోని ఆర్‌ఐ చాంబర్ కావడం, అక్కడి బీరువాలోనే హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లను దాచి ఉంచడం, ఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉండడం, ఘటనా ప్రాంతంలో ఆ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్.ఐ.నాగేంద్రప్రసాద్ నేమ్ బ్యాడ్జి లభ్యం కావడం, హత్య జరిగిన సమయంలో పోలీస్ స్టేషన్‌లో అధికారులు సహా సిబ్బంది ఉండడం, అయినా ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా హత్య చేయడం వంటి పరిణామాలు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ దారుణం జరిగిందనడానికి ప్రత్యక్ష నిదర్శనా లుగా కనిపిస్తున్నాయి. కాగా, ప్రభుత్వమే ఈ హత్యను చేయించిందని వైఎస్సార్ సీపీ నేతలు ముక్తకంఠంతో పేర్కొన్నారు.  

జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనతో ప్రసాదరెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని సామగ్రిని ధ్వంసం చేసి.. నిప్పుపెట్టారు. మరోపక్క ప్రసాదరెడ్డి హత్యతో ఆయన కుటుంబం కన్నీరుమున్నీరైంది. మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్, పరిటాల మురళిల అండతోనే హత్య జరిగిందని విరుచుకుపడ్డారు. 
Back to Top