ప్రజలపై సీఎం 'పవర్' పంచ్‌లు

హైదరాబాద్, 25 ఏప్రిల్ 2013:

ప్రజలపై ప్రభుత్వం తాజాగా విసిరిన 'పవర్' పంచ్‌పై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తంచేసింది. విద్యుత్తు వినియోగదారులపై ఇప్పటికే మోయలేని భారాన్ని మోపిన ప్రభుత్వం ఇంధన సర్చార్జీల రూపంలో మరో 609 కోట్ల రూపాయలను వసూలు చేయ నిర్ణయించిందని పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ మండిపడ్డారు. ఢిల్లీ నుంచి సీల్డు కవరులో ఊడిపడ్డ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సామంతరాజుల వ్యవస్థను తిరిగి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. పెత్తందారి వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజల సమస్యలు తెలియవని ఎద్దేవా చేశారు. ప్రతి మూడు నెలలకోసారి విద్యుత్తు చార్జీలను పెంచుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జనక్ ప్రసాద్ గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

ప్రజల అభీష్టాన్ని ప్రభుత్వం మన్నించడం లేదన్నారు. విద్యుత్తు చార్జీల పెంపును గానీ, సర్చార్జీల భారాన్ని గానీ భరించే స్థితిలో ప్రజలు లేరని ఆయన స్పష్టంచేశారు. విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆధ్వర్యంలో 30 మంది ఎమ్మెల్యేలు ఐదురోజుల పాటు నిరాహార దీక్ష చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఒక్క టీడీపీ  మినహా మిగిలిన అన్ని పార్టీలూ చార్జీల పెంపు ప్రతిపాదనను వ్యతిరేకించాయని జనక్ ప్రసాద్ చెప్పారు. ఇంత జరిగినా ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని మాత్రం మన్నించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పీల్చే గాలిపై కూడా ఈ ప్రభుత్వం పన్ను వేసేలా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

సీఎం ప్రజా నేత కాదు కనకనే ఆయనకు ప్రజల బాధలు తెలియని ఆయన వివరించారు. విద్యుత్తు వినియోగదారులపై ఇకపై భారాన్ని మోపమన్న హామీని ఆయన నిలబెట్టుకోలేదన్నారు. ఈ విషయమై అసెంబ్లీలోనే ఆయన హామీ ఇచ్చిన విషయాన్ని జనక్ ప్రసాద్ గుర్తుచేశారు. 2012-13 చివరి త్రైమాసికానికి ఎఫ్ఎస్ఏ ప్రకటించడం ద్వారా తాజా భారం మోపిన సీఎం తన హామీని నిలబెట్టుకోలేకపోయారని చెప్పారు.

2004లో టీడీపీ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్  ప్రభుత్వానికీ అదే గతి పడుతుందని జనక్ ప్రసాద్ హెచ్చరించారు. తొమ్మిదేళ్ళ పాలనలో తొమ్మిదిసార్లు విద్యుత్తు చార్జీలు పెంచినందునే టీడీపీని ప్రజలు గద్దె దించారని ఆయన చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతి మూడు నెలలకోసారి విద్యుత్తు చార్జీలను పెంచుతూ వినియోగదారులను ఇక్కట్లకు గురిచేస్తోందనీ, దీనికి కూడా టీడీపీ గతి పట్టక తప్పదనీ తెలిపారు.

వివిధ పన్నులు, చార్జీల పెంపు ద్వారా గడిచిన నాలుగేళ్ళలో ప్రజలనుంచి ముక్కుపిండి వసూలు చేసిన 60,000కోట్ల రూపాయలతో ప్రభుత్వ దాహం తీరిందా అని జనక్ ప్రసాద్ ప్రశ్నించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తన హయాంలో ఒక్క పైసా పన్ను గానీ, చార్జీలు గానీ పెంచకుండా జనరంజకంగా పాలించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆయన రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న మీరు మాత్రం చంద్రబాబు అడుగుజాడలలో నడుస్తున్నారనీ, కాబట్టి మీకు ఆయన గతి తప్పదని జనక్ ప్రసాద్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి స్పష్టంచేశారు. ప్రజలు కాంగ్రెస్, టీడీపీలకు వచ్చే ఎన్నికలలో సరైన సమాధానం చెబుతారని ఆయన పేర్కొన్నారు.

Back to Top