'ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్‌'

నెల్లూరు: అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని నెల్లూరు ఎం.పి., వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. దౌర్జన్యంగా, ఏకపక్షంగా సహకార సంఘాల ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ‌ అసలు ఎన్నికలే నిర్వహించకుండా తమవారిని పదవులకు నామినేట్ చేసుకుంటే సరిపోయేదని ‌ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

సహకార సంఘాల ఎన్నికలను కాంగ్రెస్‌ పార్టీ ఒక ప్రహసనంగా మార్చివేసిందని మేకపాటి దుమ్మెత్తిపోశారు. ఎన్నికలను పద్ధతిగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరపాల్సింది పోయి కాంగ్రెస్‌ పార్టీ అహంకారంతో, ఇష్టానుసారంగా, ఏకపక్షంగా జరుపుతోందని ఆయన విమర్శించారు. ఎలాగైనా సహకార సంఘాల ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో అనేక చోట్ల ఆ పార్టీ దౌర్జన్యానికి పాల్పడుతోందని, అరాచకాలు సృష్టిస్తోందని ఆరోపించారు.

అయితే, ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నినా జనం కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని మేకపాటి హెచ్చరించారు. ఇప్పటికే ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని మేకపాటి హితవు పలికారు.
Back to Top