ప్రభుత్వాన్ని కాపాడుతున్న చంద్రబాబు!


ఎమ్మిగనూరు

16 నవంబర్ 2012 : అవినీతి ఆరోపణలపై విచారణ జరుపకుండా చంద్రబాబును ప్రభుత్వం కాపాడుతుంటే, ప్రతిఫలంగా 'అవిశ్వాసం' పెట్ట కుండా  చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని  షర్మిల విమర్శించారు. రిలయన్స్‌కు కేజీ బేసిన్ గ్యాస్, ఐఎంజీ వంటి పలు చంద్రబాబు కుంభ కోణాలపై విచారణ ఎందుకు జరగదని ఆమె ప్రశ్నించారు. 30వ రోజు పాదయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఎమ్మిగనూరులో జరిగిన ఒక భారీ సభలో షర్మిల ప్రసంగించారు. ఇంత నీచమైన కుమ్మక్కు రాజకీయాలు మునుపెన్నడూ ఎరుగనివని ఆమె వ్యాఖ్యానించారు.
షర్మిల మాటల్లోనే...
"చంద్రబాబు తలచుకుంటే అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని వెంటనే దించేయవచ్చు. కానీ అలా దించరట. పేరుకు మటుకే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తిరుగుతున్నారుగాని నిజానికి ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది చంద్రబాబునాయుడుగారే. ప్రధాన ప్రతిపక్షమైన చంద్రబాబు పార్టీ ఇప్పుడు ప్రభు త్వానికి మిత్రపక్షమై కూర్చుంది. టిడిపికిగాని, చంద్రబాబుకుగాని, చంద్రబాబు పాదయాత్రకుగాని ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, అవిశ్వాసం పెట్టి నిజాయితీని నిరూపించుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం" అని షర్మిల సవాలు విసిరారు.
"ప్రతి రోజూ అవిశ్వాసం పెట్టమని అడుగుతూనే ఉన్నాం. కానీ చంద్రబాబు మటుకు ఈ ప్రభుత్వాన్ని పెంచి పోషిస్తున్నారు. చంద్రబాబు, కాంగ్రెస్‌తో కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారు" అని ఆమె దుయ్యబట్టారు.
"కేజీ బేసిన్ గ్యాస్ మనకు దేవుడిచ్చిన వరం. అక్కడ ఉత్పత్తి అయ్యే గ్యాస్‌తో మన పూర్తి విద్యుత్తు అవసరాలు తీరడమే కాకుండా పైప్‌లైన్ల ద్వారా కనెక్షన్లు ఇచ్చి రాష్ట్రానికంతటికీ ప్రతి ఇంటికీ అతి తక్కువ ధరకే గ్యాస్ సరఫరా చేయవచ్చు. కానీ చంద్రబాబు రానున్న తరాలకు ఈ ప్రాజెక్టు అవసరమౌతుందన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా, లక్షల కోట్లు విలువజేసే ఈ ప్రాజెక్టును రిలయన్స్‌కు కట్టబెట్టారు. చంద్రబాబు హయాంలో ఒక్కో ఎకరం రెండు మూడు కోట్లు విలువజేసేచోట 850 ఎకరాల భూములను ఆయన బినామీ సంస్థ ఐఎంజీకి కేవలం రూ.50 వేలకే కట్టబెట్టారు. అప్పటికి ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఆయనకు ఇలా భూములు కేటాయించే అధికారం లేదు. దీనిపై విచారణ చేయమంటే చేయరట! రెండెకరాల నుండి వేలకోట్లు ఎలా వచ్చాయని కమ్యూనిస్టులు ఒక పుస్తకం కూడా వేశారు. దాని మీదా విచారణ చేయరట! దేశంలో చంద్రబాబును మించిన ధనవంతుడైన రాజకీయ నాయకుడు లేడని తెహల్కా డాట్ కామ్ ఆరోపించినా కూడా విచారణ ఉండదట! చంద్రబాబుపై వచ్చిన ఆరోపణల మీద ఈ ప్రభుత్వం విచారణ జరుపకుండా కాపాడుతుంది. అందుకు ప్రతిఫలంగా చంద్రబాబునాయుడు ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా కాపాడుతున్నారు. ఇంత నీచమైన కుమ్మక్కు రాజకీయాలు ఇంతకు మునుపెప్పుడూ జరగలేదు" అని షర్మిల విమర్శించారు.
"జగనన్న విషయంలో బెయిలు కూడా రాకుండా పెద్దపెద్దవాళ్లంతా మాట్లాడుకుని కాంగ్రెస్ చెప్పుచేతల్లోని సంస్థ సిబిఐని వాడుకుని ఏ ఆధారాలూ లేకపోయినా కూడా విచారణ అన్న పేరుతో జైలులో పెట్టారు. జగనన్న గురించి మీకందరికీ తెలుసు. మీ సమస్యలను తన సమస్యలనుకుని విద్యార్థులు, రైతులు, చేనేతన్నల కోసం పోరాటాలు చేశాడు. మీ మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నాడనీ, అదే జరిగితే ఇక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు మనుగడ ఉండదని కుట్రలు పన్ని జగనన్నను జైలుపాలు చేశారు" అని ఆమె ఆరోపించారు.
"జగనన్నను, రాజన్నను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. కానీ జగనన్నను ఎవ్వరూ ఆపలేరు. జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, టిడిపిలకు బుద్ధి చెబితే రాజన్న రాజ్యం కూడా వస్తుంది. రాజన్న కలలను జగనన్న నెరవేరు స్తాడు. కోటి ఎకరాలకు నీరందించాలన్న వైయస్ కల నెరవేరుతుంది. గుడిసె అన్నదే లేకుండా ప్రతి ఒక్కరికీ ఇల్లుండాలన్న కల నెరవేరుతుంది" అని షర్మిల భరోసా ఇచ్చారు.

Back to Top