సభ్యత మరిచి మోత్కుపల్లి వ్యాఖ్యలు

హైదరాబాద్ 02 జూలై 2013:

టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై మచిలీపట్నం తాజా మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి డీఎన్ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందేనని ఆయన ఎలా మాట్లాడతారని వ్యాఖ్యానించారు. సభ్యత, సంస్కారాలను మరిచి మాట్లాడటం తగదని తెలిపారు.

జగన్ కాంగ్రెస్ డీఎన్ఏనని టీడీపీ నేతలు అభివర్ణించడాన్ని పేర్ని ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు ఎక్కడినుంచి వచ్చారో గుర్తుచేసుకోవాలని సూచించారు. 1998లో మోత్కుపల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన విషయాన్ని మరిచిపోయాడని తెలిపారు. బిజు పట్నాయక్ ఎక్కడినుంచి వచ్చారు... టీడీపీలో ఉన్న అనేకమంది ఎక్కడి నుంచి వచ్చారు... ఆలోచించుకోవాలన్నారు. గులాంనబీ ఆజాద్ ఉప ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిగారు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి ఉండకపోతే కేంద్ర మంత్రి అయ్యేవారనీ, తదుపరి ముఖ్యమంత్రి కూడా అయి ఉండేవారనీ చెప్పిన విషయాన్ని కూడా నాని జ్ఞాపకం చేశారు.

ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకోవడానికి మొట్టమొదటి వైద్య బృందాన్ని తమ పార్టీ పంపిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు విహార యాత్ర పేరుతో అమెరికాలో తన వ్యాపార లావాదేవీలు పూర్తిచేసుకుని వచ్చి, తనొక్కడే తెలుగువారిని ఆదుకోవడానికి ప్రయత్నించినట్లు చెప్పడం శోచనీయమన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై దాడిచేయాల్సిన శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల ఆ బాధ్యతను విస్మరించి అక్కసుతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుడు కార్యక్రమానికి పూనుకుంటున్నారనీ, ఇది ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. ప్రజలకు ఎదురైన కష్టాలను తనకు అనుకూలంగా చంద్రబాబు మలచుకుంటారని ఎద్దేవా చేశారు.

ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఆందోళనలు చేయకుండా శ్రీ జగన్మోహన్ రెడ్డిని చూసి ఉలిక్కిపడుతూ ఆయనపట్ల నీచంగా, హేయంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రజల పక్షాన ప్రతిక్షణం మేము పాటుపాడతామని నాని స్పష్టంచేశారు. టీడీపీ తొలుత కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయే పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు. తమ పార్టీకి అలాంటి ఆలోచనేం లేదని స్పష్టంచేశారు. తెలంగాణపై ప్లీనరీలో తీసుకున్న నిర్ణయానికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన తీర్మానాన్ని చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయం ఆయన వ్యక్తిగతమన్నారు.

Back to Top