జ‌న‌నేత భ‌రోసా- గిట్టుబాటు ధ‌ర లేద‌ని రైతులు
- బ్యాంకులు రుణాలు ఇవ్వ‌డం లేద‌ని డ్వాక్రా మ‌హిళ‌లు
- పింఛ‌న్ రావ‌డం లేద‌ని వృద్ధులు, విక‌లాంగులు
-  స్కాల‌ర్‌షిప్‌లు రావ‌డం లేద‌ని విద్యార్థులు
- సీపీఎస్ విధానం ర‌ద్దు చేయాల‌ని ఉద్యోగులు
- అంద‌రి స‌మ‌స్య‌లు ఓపిక‌తో వింటున్న ప్ర‌తిప‌క్ష నేత‌
- మళ్లీ మంచి రోజులొస్తాయ‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ

క‌ర్నూలు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స‌మ‌స్య‌లు వెల్లువ‌లా వ‌స్తున్నాయి. చంద్ర‌బాబు నాలుగేళ్ల పాల‌న‌లో న‌ష్ట‌పోయామ‌ని దారిపోడువునా ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్ష నేత‌కు మొర‌పెట్టుకుంటున్నారు. దివంగత ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న‌లో బాగా బ‌తికామ‌ని, ఇప్పుడు ఏ ప‌థ‌కం కావాల‌న్నా జ‌న్మ‌భూమి క‌మిటీల పెత్త‌నం పెరిగిపోయింద‌ని ఫిర్యాదులు చేస్తున్నారు. నాలుగేళ్లుగా క‌రువు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నామ‌ని, చంద్ర‌బాబు చేస్తాన‌న్న రుణాలు మాఫీ కాలేద‌ని, పండించిన పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర లేద‌ని అన్న‌దాత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పావ‌లా వ‌డ్డీ రుణాలు అంద‌డం లేద‌ని డ్వాక్రా అక్క‌చెల్లెమ్మ‌లు, పింఛ‌న్లు రావ‌డం లేద‌ని వృద్ధులు, విక‌లాంగులు, వితంతువులు, ఫీజులు అంద‌డం లేద‌ని విద్యార్థులు, సీపీఎస్ విధానం ర‌ద్దు చేయాల‌ని ఉద్యోగులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి మొర‌పెట్టుకున్నారు. వీరంద‌రికీ జ‌న‌నేత ధైర్యం చెబుతూ ఓ ఏడాది ఆగండి మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పిస్తున్నారు. ఈ నెల 6న వైయ‌స్ఆర్ జిల్లా  ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఈ నెల 14 నుంచి క‌ర్నూలు జిల్లాలో కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆళ్ల‌గ‌డ్డ‌, బ‌న‌గాన‌ప‌ల్లె, డోన్ నియోజ‌క‌వ‌ర్గాల్లో యాత్ర పూర్తి కాగా, ప్ర‌స్తుతం ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో సాగుతోంది. ఈ సంద‌ర్భంగా ఆయా వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారంటే ఆయ‌న అయితేనే త‌మ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని భావిస్తున్నారు. మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకువ‌స్తార‌న్న న‌మ్మ‌కం ఉండ‌బ‌ట్టే ఆయ‌న పాద‌యాత్ర‌ల‌కు కులాలు, మ‌తాల‌కు అతీతంగా మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. గ్రామ గ్రామాన రాజ‌న్న బిడ్డ‌కు పూల‌బాట వేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను క‌లిసిన ప్ర‌జ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ మంచి రోజులు వ‌స్తున్నాయ‌ని భ‌రోసా క‌ల్పిస్తున్నారు. నిన్న ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు ప‌లు స‌మ‌స్య‌లు వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు . ఆ వివ‌రాలు ఇలా.. 

మా ముసలోల్ల కష్టాలన్నీ తీర్చాలి’ 
‘నాయనా.. నా పేరు ఎల్లమ్మ.. 80 ఏళ్లు నాకు. ఏమి గవర్నమెంటోళ్లు నాయనా.. వేలిముద్ర పడడం లేదని నాకొచ్చే పది కేజీల బియ్యం కూడా ఇవ్వడం లేదు’ అని వెల్దుర్తి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు చేతిలో కర్రపట్టుకుని వణుకుతూ వచ్చి జగనన్నను పట్టుకుని విలపించింది. ఎంతో అభిమానంతో వచ్చిన అవ్వ బాధ విన్న వైయ‌స్‌ జగన్‌ స్పందిస్తూ..  అవ్వా త్వరలోనే మన కష్టాలన్నీ తీరుతాయని భ‌రోసా క‌ల్పించారు. 

వడ్డీ మీద వడ్డీ చెల్లించాము 
ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఓట్లు వేయించుకుని..తరువాత ఏవీ చేయకుండా మమ్మల్ని మోసం చేశాడు’ అని వెల్దుర్తి మండలం ఎల్‌.బండ తండా లంబాడీ మహిళలు వైయ‌స్‌ జగన్‌ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.  గ్రామానికి చెందిన లంబాడీ మహిళలు బుజ్జి, వెంకటమ్మ, నాగమ్మ, తులసి తదితరులు జ‌న‌నేత‌కు త‌మ సమస్యలను విన్నవించారు. పొదుపు రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో అప్పులు చేసి వడ్డీ మీద వడ్డీ కట్టామని వాపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఎలాంటి సమస్యలు ఉండేవి కావని, ఆయన మరణించినప్పటి నుంచి సమస్యలతో సతమతమవుతున్నామని తెలిపారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు లేవు. మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, పిల్లలు ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రావడం లేదని తెలిపారు. పిల్లలకు ఉపకార వేతనాలు అందడం లేదని, కనీసం తమకు ఇళ్లు కూడా లేవని వారు వైయ‌స్ జగన్‌ దృష్టికి తెచ్చారు. వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ వైయ‌స్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

అప్పుల్లో కూరుకుపోయాం
 దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  హయాంలో వ్యవసాయానికి స్వర్ణయుగమని.. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో అన్నదాతలు అప్పుల్లో కూరకుపోయారు’ అని సిద్ధనగట్టుకు చెందిన రైతు అయ్యప్పరెడ్డి వైయ‌స్‌ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్త చేశాడు. హంద్రీ–నీవా రిజర్వాయర్‌ను పూర్తి చేస్తే పత్తికొండ, డోన్‌ నియోజకవర్గాల్లోని రైతులకు మూడుకార్ల పంటలకు నీళ్లు అందించవచ్చన్నారు. అయితే సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను ఆదుకోవాలని కోరగా వైయ‌స్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

చనిపోదామని మూడుసార్లు బావిలో దూకాను
నాకు పింఛన్‌ కావాలని మూడేళ్లుగా మా అమ్మతో కలిసి తిరగని ఆఫీసు లేదు. కలవని అధికారి లేడు. చివరికి విసిగి వేసారి చనిపోదామని మూడుసార్లు బావిలో దూకాను. మా వీధిలో వాళ్లు నన్ను బతికించారు. నా బాధ వినేవారు లేరు. మా అమ్మకు పింఛన్‌ వస్తోందని నాకివ్వరంట. పింఛన్‌ కోసం కొత్త రేషన్‌కార్డు నా పేరు మీద తీసుకున్నాను. అయినా ఇంతవరకు పింఛన్‌ ఇవ్వలేదు. మీరైనా కరుణించండి అన్నా’ అని వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన మానసిక వికలాంగుడు(90శాతం) బిల్ల చిన్న గోవిందు వైయ‌స్‌ జగన్‌కు తన బాధను చెప్పాడు. వైయ‌స్‌ జగన్‌ స్పందిస్తూ ఇంత దౌర్భాగ్య పరిస్థితులకు కారణం చంద్రబాబేనని, త్వరలో మన ప్రభుత్వం వస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 

పిల్ల‌ల‌ను చ‌దించుకోవ‌డం క‌ష్టంగా మారింది
స్కాలర్‌ షిప్‌లు రాక పిల్లలను చదివించుకోవడం కష్టమైందని రామళ్లకోటకు చెందిన పలువురు మహిళలు జ‌న‌నేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.నర్సాపురం క్రాస్ వ‌ద్ద  మహిళలు అధికసంఖ్యలో రాజ‌న్న బిడ్డ‌ వద్దకు వచ్చి సమస్యలు ఏకరువు పెట్టారు. ప్రస్తుతం తమ పిల్లలు హైస్కూల్‌ నుంచి ఇంటర్, డిగ్రీ చదువులు చదువుతున్నారని, స్కాలర్‌షిప్‌లు అందక కూలి చేసుకు బతికే తాము పిల్లలను చదువు మాన్పించాల్సి వస్తోందని పదుల సంఖ్యలో మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని చూసి చలించిన వైయ‌స్‌ జగన్‌ వారితో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను, విద్యార్థులను పట్టించుకోవడం లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తామని భరోసానిచ్చారు. 

నా భ‌ర్త ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు
తన భర్త రైతు సుంకయ్య 2015లో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని కలుగొట్ల నాగలక్ష్మమ్మ వాపోయింది. సాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని విన్నవించింది. వైయ‌స్‌ జగన్‌ ఆమెతో మాట్లాడుతూ మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ ఒక్క రైతు ఆత్మహత్యకు పాల్పడకుండా చూస్తానని, ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న వారికి న్యాయం చేస్తానన్నారు.

స్కాల‌ర్‌షిప్‌లు రావ‌డం లేదు
స్కాలర్‌షిప్‌లు రావడం లేదు సార్‌ అని రామళ్లకోటకు చెందిన విద్యార్థి రాజేష్‌(8వ తరతగతి) వైయ‌స్‌ జగన్‌కు విన్నవించాడు. ఆన్‌లైన్‌లో స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకుని, బ్యాంకు అకౌంటు ఓపెన్‌ చేయమని సారోళ్లు చెబితే అన్ని పూర్తి చేశానన్నాడు. కానీ స్కాలర్‌షిప్‌లు మాత్రం రావడం లేదని, తమలాంటి పేద విద్యార్థులకు అండగా ఉండండి అన్నా అని వేడుకున్నాడు. పేదవిద్యార్థుల చదువులకు భరోసా కల్పించేలా చూస్తానని వైయ‌స్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

ఉద్యోగం రాక బ‌ట్ట‌లు ఉతుకుతున్నా..
‘అన్నా.. నేను బీపీఈడీ చదివా. అయినా ఉద్యోగం రాలేదు. బతుకుదెరువు కోసం కులవృత్తి అయిన దుస్తులు ఉతకడం తప్పడం లేదు. నాతో పాటు మా ఇంట్లో నలుగురు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. నా భర్త మధు పీజీ, మరుదులు కృష్ణ.. బీఏ, రాము.. బీఏ, బీఈడీ చదివినా అందరిదీ ఇదే పరిస్థితి..’ అని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన నాగజ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు.

♦ ‘అన్నా.. నా పేరు వెంకటస్వామి. లక్షా పదిహేను వేల రూపాయల పంట రుణం తీసుకున్నా.. చంద్రబాబు లక్షన్నర రూపాయలు రుణ మాఫీ చేస్తానన్నారు. నాకు మాత్రం రూపాయి కూడా మాఫీ కాలేదు.’
♦ ‘అన్నా.. నా పేరు గోపాల్‌. మాది వెల్దుర్తి మండలం గోవర్ధనగిరి. 2014 ముందు రూ.25 వేలు బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నా. నాకు మాఫీ అయ్యింది కేవలం రూ.1100  మాత్రమే. వడ్డీలు పెరిగి అది ఇప్పుడు రూ.35 వేలు అయ్యింది. రుణమాఫీ ఒట్టి బోగస్‌.’ ఇలా వీరే కాకుండా పలువురు రైతులు, డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు వైఎస్‌ జగన్‌ ఎదుట తమ కష్టాలు ఏకరువు పెట్టారు.  
♦ అక్షయ గోల్డ్‌ సంస్థ చేసిన మోసం కారణంగా ఏజెంట్లు, డిపాజిటర్లు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అక్షయ గోల్డ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సురేశ్‌బాబు, నాయకులు నారాయణ, నాగేశ్వరరావు, రహంతుల్లా తదితరులు జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు.
♦ పోలీసు శాఖలో విశిష్ట సేవలందిస్తున్న తమ పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని కర్నూలు జిల్లా హోంగార్డుల సంఘం ప్రతినిధులు వెంకటేశ్వర్లు, నారాయణస్వామి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top