బాబును ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు

– మహానాడులో ఎన్నికల హామీలపై నోరుమెదపని బాబు
– కేంద్రం ఇచ్చిందంటున్న రూ.1.75 కోట్ల ఖర్చుపై శ్వేతపత్రం ఇవ్వండి
– చంద్రబాబుపై వైయస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్‌ ఆసిఫ్‌ ధ్వజం

అమరావతి : ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీల అమలుపై ఒక్క మాట మాట్లాడకుండా సీఎం చంద్రబాబు ప్రజల చెవ్వుల్లో పూలు పెట్టారని వైయస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్‌ ఆసిఫ్‌ ధ్వజమెత్తారు. మంగళవారం కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విశాఖపట్నంలో గత మూడు రోజులపాటు నిర్వహించిన మహానాడులో కేవలం పార్టీ తీరుపై గుర్రుగా ఉన్న టీడీపీ సీనియర్‌ నేతల్ని బుజ్జగించడానికి, తెలంగాణలో అధికారపార్టీ తమ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకోవడం రాజ్యంగ విరుద్ధమని చెప్పుకోవడానికే సీఎం చంద్రబాబు అధిక సమయం కేటాయించారని ఎద్దేవా చేశారు. అధికారం చేపట్టిన మూడేళ్లలో తాత్కాలిక రాజధానిని నిర్మించడం మినహా ఏ ఒక్క అభివృద్ధి పనికి శ్రీకారం చుట్టలేదని విమర్శించారు. బీజేపీ అధినేత అమిత్‌షా రాష్ట్రానికి కేంద్రం రూ. లక్షా.75 కోట్లు ఇచ్చిందంటున్నారు.. అయితే ఆ డబ్బు ఏవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిందో సీఎం చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని.. శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు, డ్వాక్రా మహిళలు, యువత ఇలా అందరినీ చంద్రబాబు మాయమాటలతో మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు మాటల్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని.. ఆ పార్టీకి బుద్ధి చెప్పే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ గౌస్‌ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై సవాళ్లు విసిరేస్థాయి మంత్రి లోకేష్‌ది కాదని.. ఆయన ఇటీవల ప్రకటించిన టోల్‌ఫ్రీ నంబరు మాత్రమే పనిచేస్తోందని.. నీళ్లు, ట్యాంకర్లు లేవన్న విషయంపై ఆయన దృష్టిసారిస్తే మంచిదన్నారు. ఆయన చిత్తశుద్ధి ఉంటే తన తండ్రి ద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయించాలని సవాలు విసిరారు. పార్టీ నగర అధికార ప్రతినిధి మనోజ్‌ కోఠారి మాట్లాడుతూ.. చంద్రబాబుకు టెపంరరీ విజన్‌ తప్ప పర్మినెంట్‌ విజన్‌ అంటూ ఏదీ లేదన్నారు. ఈ సమావేశంలో విజయవాడ 31వ డివిజన్‌ ప్రెసిడెంట్‌ కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top