కుప్పానికి చంద్ర‌బాబు చేసింది శూన్యం


చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు 30 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి  చేసింది శూన్యమని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. అపారమైన అనుభవం, తెలివి తెలంగాణ ఎన్నికల్లో తేటతెల్లమైందన్నారు.  తెలంగాణలో చంద్రబాబు వెళ్ళకుండా ఉంటే కాంగ్రెస్‌కు మరో 20 సీట్లు అధికంగా వచ్చేవని, బాబును నమ్మడం వల్ల కాంగ్రెస్‌ తీవ్రంగా నష్టపోయిందని వివరించారు.  శాంతిపురంలోని ఓ కల్యాణ మండపంలో జరిగిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా చంద్రబాబును అనుభవజ్ఞుడని, మంచి తెలివిపరుడని ఇతర రాజకీయ పార్టీలవారు నమ్మేవారని, తెలంగాణలో వచ్చిన ఎన్నికల ఫలితాల్లో ఆయన తెలివి ఎంత మాత్రమో స్పష్టంగా తెలిసిందని చెప్పారు. చదువుకున్న రోజుల్లోనూ ఆయన పెద్ద తెలివిపరుడుకాదని, అప్పట్లో  బాబు సామాజికవర్గానికి చెందిన ఓ ప్రొఫెసర్‌ ద్వారా డిగ్రీ పాస్‌ సర్టిఫికెట్లు పొందారని విమర్శించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఫలితాలను చూసి పొంగవద్దని, అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఉండటంతో ప్రజలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపారని తెలిపారు. తెలంగాణలో చంద్రబాబు వెళ్ళకుండా ఉంటే కాంగ్రెస్‌కు మరో 20 సీట్లు అధికంగా వచ్చేవని, బాబును నమ్మడం వల్ల కాంగ్రెస్‌ తీవ్రంగా నష్టపోయిందని వివరించారు. 

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పాలారు ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించి శంకుస్థాపన చేస్తే చంద్రబాబు తమిళనాడుతో కుమ్మక్కై కోర్టును ఆశ్రయించి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుపడ్డారని విమర్శించారు. కుప్పానికి హంద్రీ–నీవా కాలువ ద్వారా నీరు ఇప్పటివరకు రాకపోవడం దారుణమన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యుల్‌ ప్రకటించే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ సైనికుల్లా కృషి చేసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర ప్రారంభం రోజున పాడిరైతులకు లీటరు పాలకు రూ.4 ఇన్సెంటివ్‌ ఇస్తామని హామీ ఇచ్చారని, ఇలాంటివి చంద్రబాబు ఒక్కటైనా అమలు చేశారా ? అంటూ ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో గాండ్ల సామాజికవర్గంవారు 30 ఏళ్లుగా చంద్రబాబును నమ్మారని, ఒక్క గౌనివారి శ్రీనివాసులుకు పదవులు ఇచ్చారే తప్ప మిగిలిన గాండ్ల సామాజికవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రమౌళిని గెలిపించండి... ఆయన చంద్రబాబుకంటే అభివృద్ధి చేయగల సమర్థుడని తెలిపారు.

మార్పు తీసుకురండి అండగా ఉంటాం– జంగాలపల్లె శ్రీనివాసులు
ఏళ్ల తరబడిగా ఒకే వ్యక్తిని నమ్మడం వల్ల కుప్పం అభివృద్ధి చెందలేదని, మార్పు తీసుకొస్తే వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి ఇక్కడి నుంచి మరో శాసనసభ్యుడిని పంపేందుకు కార్యకర్తలు కృషిచేయాలని కోరారు.వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్, వైఎస్సార్‌సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి, కుప్పం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


 
Back to Top