సమైక్యాంధ్రకే వైయస్ఆర్‌సిపి కట్టుబడి ఉంది

సాలూరు (విజయనగరం జిల్లా),

15 సెప్టెంబర్‌ 2013: సమైక్యాంధ్రకే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని శ్రీమతి షర్మిల స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో వాటా లేదంటే జీతాలు, పింఛన్లు, సంక్షేమ పథకాల అమలుకు సీమాంధ్రలో నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నీళ్ళను అడ్డుకుంటే సీమాంధ్ర మహా ఎడారిగా మారిపోదా అని నిలదీశారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలోనే  పెద్ద మద్యం మాఫియా డాన్ అని ఆ పార్టీ‌వాళ్లే చెబుతుంటారని శ్రీమతి షర్మిల విమర్శించారు. విజయనగరం జిల్లా సాలూరులో ఆదివారం రాత్రి జరిగిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

నీళ్ళు, నిధులు ఇవ్వకపోతే సీమాంధ్ర ప్రాంతం వాళ్లు బతకాలా? లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవాలా? అని బొత్సని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇంత అన్యాయం‌ చేస్తున్నా సిఎం కిరణ్ కుమా‌ర్ రెడ్డి దిష్టిబొమ్మలా కూర్చున్నారన్నారు. బొత్స ఈ ప్రాంతం నాయకుడు కదా, ‌పిసిసి అధ్యక్షుడు కదా, ఈయన గారు సమాధానం చెప్తారా అంటే ఈయన కూడా దిష్టిబొమ్మలా చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని చీల్చే సంగతి సిఎం, బొత్సలకు ముందే తెలుసన్నారు. ఆ విషయం కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదే‌వ్ స్వయంగా చెప్పారన్నారు. విభజనను అడ్డుకుంటే పదవులు పోతాయని అడ్డుకోలేదన్నారు. ఆఖరికి దిగ్విజ‌య్ సింగ్ వచ్చి రాష్ట్రాన్ని చీలుస్తున్నామని ప్రకటన చేసేవరకూ బొత్స, కిర‌ణ్ గోప్యంగా ఉంచారని మండిపడ్డారు.

‌సీమాంధ్ర ప్రజలకు సమాధానం చెప్పుకునే బాధ్యత బొత్సగారికి లేదా? కాంగ్రెస్‌.. రాష్ట్రాన్ని చీలుస్తుందన్న విషయం బొత్సకు ముందు తెలుసా? తెలియదా? ఒకవేళ బొత్సకు ముందే తెలిస్తే దానిని ఎందుకు అడ్డుకోలేదు? అడ్డుకోలేకపోతే ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ప్రజలను ఎందుకు హెచ్చరించలేదు? అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. లేకపోతే మీకంత సీన్ లేదని, మీరంత నాయకుడు కాదని, మీకు చెప్పకుండానే అధిష్టానం చేసేసిందా బొత్స గారూ? అని అడిగారు. మీకు తెలియకుండా, చెప్పకుండా చేసి ఉంటే దిగ్విజ‌య్ ప్రకటన చేసిన‌ రోజే మీరెందుకు రాజీనామాలు చేయలేదు? ఎందుకు ప్రజల పక్షాన నిలబడలేదో చెప్పాలి? అని డిమాండ్ చేశారు.

‌ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతి వ్యాపారాన్ని బొత్స కుటుంబమే స్వాహా చేస్తున్నట్లు ప్రతిఒక్కరికీ తెలిసిన విషయమే అని శ్రీమతి షర్మిల అన్నారు. మీరు ఇన్ని అక్రమాలు చేస్తున్నా, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రజలు ఇంకా మోస్తూనే ఉన్నారు కదా బొత్సగారూ మరి చూస్తూ.. చూస్తూ.. ప్రజలకు ఇంత అన్యాయం చేయాలని మీకెలా అనిపించింది బొత్సగారూ? అని అడిగారు.

కోట్లాది మంది తెలుగు ప్రజలకు ఘోరమైన అన్యాయం జరుగుతుంటే.. ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కూడా చలనం లేకుండా చూస్తున్నారని శ్రీమతి షర్మిల విమర్శించారు. విభజనకు కారణమే చంద్రబాబు అన్నారు. తెలంగాణకు అనుకూలంగా బ్లాంక్ చెక్కులా లేఖ ఇచ్చారని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించే సాహసం కాంగ్రె‌స్ చేస్తుందం‌టే.. దానికి కారణం చంద్రబాబు విభజనకు పలికిన మద్దతే అన్నారు. హత్యచేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చినట్టుంది చంద్రబాబు తీరు అన్నారు. చంద్రబాబు విభజనకు అనులకూంగా లేఖ ఇచ్చి, మళ్లీ మొసలికన్నీరు పెడుతూ బస్సుయాత్రలు చేశారని విమర్శించారు. టిడిపి సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలమని చెప్తే, వైయస్ఆర్‌‌ కాంగ్రెస్, సిపిఎం, ఎంఐఎం విభజనకు అనుకూలమని ఎప్పుడూ చెప్పలేదని వివరించారు. చంద్రబాబులో ఏమాత్రం నిజాయితీ మిగిలి ఉన్నా, తాను కూడా విభజనకు వ్యతిరేకమే అని ఈ పార్టీల పక్షాన నిలబడాలన్నారు.
కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. తప్పైపోయిందని ఇచ్చిన లేఖను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సీమాంధ్ర ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి చంద్రబాబు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేయాలని కోరారు. అంతవరకు సీమాంధ్రలో అడుగుపెట్టడానికి వీల్లేదన్నారు. చంద్రబాబును, ఆయన ఎమ్మెల్యేలను తరిమి తరిమికొట్టాలని షర్మిల పిలుపు ఇచ్చారు. చేసిందంతా చంద్రబాబు చేసి, విభజనకు వైయస్‌ఆర్ కారణమంటున్నారని మండిపడ్డారు. వై‌యస్‌ఆర్ బతికి ఉంటే రాష్ట్రానికి ఈ గతి‌ పట్టేది కాదని స్వయంగా ప్రధాని చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ చంద్రబాబుకు మనస్సాక్షి లేదని అనుకోవాలా? ఆయన ఒంట్లో ప్రవహించేది మానవరక్తం కాదనుకోవాలా? అని అడిగారు. చంద్రబాబు ఇలాంటి అబద్ధాలు ఎన్నైనా చెప్పగలరన్నారు.

రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కాంగ్రె‌స్ పార్టీ ఏకైక లక్ష్యం అని‌ శ్రీమతి షర్మిల విమర్శించారు. ఆ లక్ష్యం కోసమే కోట్ల మందికి కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేస్తోందన్నారు. టిఆర్‌ఎస్‌ను కలుపుకోవడం కూడా వారి మరో లక్ష్యం అన్నారు. చేసిన పాపాలు, ఘోరాలు సరిపోవంటూ ఇప్పుడు విభజన అంటూ అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిందని మండిపడ్డారు. గొడ్డలితో రెండు ముక్కలుగా నరికినట్టు కాంగ్రెస్‌ పార్టీ మన రాష్ట్రాన్ని ముక్కలుగా చేస్తోందన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్‌ ఇదంతా చేస్తోందని విమర్శించారు.

ఇప్పటికే కృష్ణా నీళ్లు ఎంత కష్టంగా రాష్ట్రానికి వస్తున్నాయో చూస్తున్నామని చెప్పారు. మధ్యలో మరో రాష్ట్రం వస్తే కృష్ణానది నీళ్లు రావని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామంటోంది కాంగ్రెస్‌ పార్టీ, మధ్యలో ఇంకో రాష్ట్రం వస్తే  పోలవరం ప్రాజెక్టును ఏ నీళ్లతో నింపుతారు? అని ప్రశ్నించారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సముద్రం నీళ్లు తప్ప మంచినీళ్లు ఎక్కడ ఉన్నాయని అడిగారు. గ్రామాలకు గ్రామాలే వల్లకాడు అవుతాయని హెచ్చరించారు. నీళ్లు ఇవ్వరంట, రాజధానిని కూడా ఇవ్వరంట, గతంలో మద్రాసును తీసుకున్నారు, ఇప్పుడు హైదరాబాద్‌నూ దూరంచేస్తారంట అని విమర్శించారు.

‌హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే అందులో సీమాంధ్రుల శ్రమలేదా? అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. సీమాంధ్రులకు హైదరాబాద్‌లో భాగం లేదు, వెళ్లిపోమ్మనడం న్యాయమా? అని అడిగారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి 60 ఏళ్లు పట్టింది. హైదరాబాద్ లాంటి రాజధానిని‌ కేవలం పదేళ్ళలో కట్టుకోడం ఎలా సాధ్యం అవుతుంది? రాష్ట్ర బడ్జెట్లో కేవలం హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం యాభై‌ శాతం పైగా ఉంటోంది. ఈ ఆదాయం పోతే పథకాలు ఎలా నడుస్తాయి? అని అడిగారు.

కాగా, జోరువానలోనే సాలూరులో శ్రీమతి షర్మిల సమైక్య శంఖారావం బహిరంగ సభ జరిగింది. శ్రీమతి షర్మిల వస్తున్నారని తెలిసి అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వర్షంలో కూడా వారందరూ నిలబడి ఆమె ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు.

తాజా వీడియోలు

Back to Top