పట్టిసీమ ప్రమాదకరం

పర్యావరణవేత్తల ఆందోళన
పట్టించుకోని చంద్రబాబు


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానసపుత్రికైన పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో కృష్ణాడెల్టా రైతుల సాగునీటి అవసరాలు తీరే మాట ఎలా ఉన్నా పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమించే అవకాశముందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముందంటున్నారు.  కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మెట్టభూముల్లో వాతావరణ మార్పులతో పాటు అత్యంత సున్నితమైన జీవవైవిధ్యం దెబ్బతినిపోతుందని దానివల్ల వేల ఎకరాలలో వ్యవసాయ  ఉత్పత్తులు దెబ్బతినిపోతాయని వారు పేర్కొంటున్నారు. గోదావరి నీటిని 174 కిలోమీటర్ల మేర కాలవల ద్వారా తీసుకువచ్చి ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదిలో కలపడం వల్ల నీటి నాణ్యతలో మార్పులు వస్తాయని, భూగర్భ జలాల సమతుల్యత కూడా దెబ్బతింటుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. రెండు నదీ పరివాహక ప్రాంతాలలోని నీటిని కలపడం వల్ల జలాల పర్యావరణంలో మార్పులు సంభవిస్తాయని దానివల్ల చేపల ఉత్పత్తి దారుణంగా దెబ్బతినిపోతుందని అంటున్నారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు  తాత్కాలిక ప్రత్యామ్నాయంగా పట్టిసీమను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి నీటిని కాలువల ద్వారా కృష్ణలోకి చేర్చుతారు. పర్యావరణ ప్రభావానికి సంబంధించి ఎలాంటి అధ్యయనమూ జరపకుండా ఇంత భారీ స్థాయిలో ఒక నది నీటిని మరో నదిలోకి చేర్చడం వల్ల మంచి కన్నా కీడే ఎక్కువ జరుగుతుందని ప్రముఖ పర్యావరణ వేత్త వి.సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. నదుల అనుసంధానం వల్ల చేపల ఆహారంపై ప్రభావం చూపించడమే కాక  చేపల సహజ ఉత్పత్తి ఆవాసాలుగా ఉన్న ప్రాంతాలపైనా తీవ్ర దుష్ర్పభావం చూపిస్తుందని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్ హెచ్చరించాయి కూడా. అలాగే గోదావరిలో నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణకు మళ్లించడం వల్ల గోదావరి పరీవాహక ప్రాంతంలోని మడ అడవులు కూడా దెబ్బతినిపోతాయని దానివల్ల మొత్తం డెల్టా వ్యవస్థే ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Back to Top