బలహీనవర్గాల అభివృద్ధే లక్ష్యం

  • సంక్షేమ పథకాలను నీరుగార్చిన ప్రభుత్వం
  • హామీలు అమలు చేయకుండా మోసం చేసిన బాబు
  • బలహీన వర్గాల సమస్యలపై వైయస్సార్సీపీ కమిటీ
  • క్షేత్రస్థాయిలో పర్యటన
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి
విజయవాడః టీడీపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా నీరుగార్చిందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. ఈ మూడున్నరేళ్లలో రకరకాల ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేసిందే తప్ప బలహీన వర్గాలకు మేలు చేసే ఒక్క కార్యక్రమం కూడ ఈ ప్రభుత్వం చేపట్టలేదని పార్థసారధి విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో వైయస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర బీసీ సెల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తితో కలిసి పార్థసారధి మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ చెప్పిన సమస్యల్ని వైయస్ జగన్ కులంకుశంగా అర్థం చేసుకొని వాటిని నోట్ చేసుకున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వాటన్నంటికి పరిష్కారాలు చూపించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సమావేశం ద్వారా బలహీన వర్గాల్లో వైయస్సార్సీపీ బలం ఇంకా పుంజుకుంటోందని నమ్ముతున్నామని పార్థసారధి తెలిపారు. 

వివిధ కులవృత్తుల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వైయస్ జగన్ తిలకించి వారి సమస్యలను కూడ తెలుసుకున్నారన్నారు. ఎన్నికల్లో తాయిలాలు ఇచ్చినట్టు బలహీన వర్గాలకు అనేక హామీలిచ్చి ఒక్కటి కూడ అమలు చేయకుండా బాబు మోసం చేశారని అన్నారు. వైయస్ఆర్  బలహీన వర్గాలకు ఆర్థికమైన సపోర్ట్ ఇస్తే.... ఈ ప్రభుత్వం వాటిని తొలగించందని పలువురు అధినేత దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. రాయితీలు, పెన్షన్లు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. బలహీన వర్గాలకు అన్ని కోట్లు, ఇన్ని కోట్లు ఇచ్చామని ప్రభుత్వం చెప్పడమే తప్ప ఇచ్చిందేమీ లేదన్నారు.  క్షేత్రస్థాయిలో కులవృత్తులకు అవి ఎక్కడ చేరలేదని సమావేశానికి వచ్చినవారు చెప్పడం జరిగిందన్నారు. రెండు మూడు రోజుల్లో ఓ కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో అన్ని కులాలకు సభ్యత్వం కల్పించి క్షేత్రస్థాయిలో పర్యటన చేసి బలహీన వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలని వైయస్ జగన్ సూచన చేశారన్నారు. వారు ప్రభుత్వం నుంచి ఏవిధమైన సపోర్ట్ ఆశిస్తున్నారు. వాళ్ల వృత్తులనుఏ విధంగా అభివృద్ధి చేయోచ్చన్న అంశాలను తెలుసుకోవాలన్నారు.

వైయస్ఆర్ గొప్ప మనుసుతో ఏర్పాటు చేసిన ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా వేలమంది డాక్టర్లు, ఇంజినీర్లు, గ్రాడ్యూయేట్లు అయ్యారని పార్థసారధి తెలిపారు.  స్వాతంత్ర్యం వచ్చాక మైనారిటీస్ కు ఇప్పటివరకు ఎప్పుడు లేనివిధంగా వైయస్ఆర్ వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని చెప్పారు. సగరలు, వడ్డెరలు లాంటి కులస్తులు యంత్రాలొచ్చాక ఉపాధి కోల్పోయారని..ఈ పరిస్థితుల్లో వారిని ఎలా ఆదుకోవాలన్న దానిపై  స్టడీ చేయమని  అధినేత సూచించారన్నారు. వైయస్ జగన్ ఆర్నెళ్లలో పాదయాత్ర పూర్తిచేసే సమయంలో రాష్ట్రమంతా పర్యటించి కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. పాదయాత్ర అయిపోయాక బీసీ గర్జన, బీసీ డిక్లరేషన్ పెద్ద ఎత్తున చేపడుతామన్నారు. బలహీన వర్గాలకు చెందిన నాయకులతో ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో సమస్యకు పరిష్కారం కనుగొనడం జరుగుతుందన్నారు. వైయస్సార్సీపీ, జగన్ నాయకత్వంపై బలహీన వర్గాలు పూర్తి నమ్మకంతో ఉన్నాయన్నారు. బలహీన వర్గాలు ఊహించని విధంగా వైయస్ఆర్ మెరుగైన పథకాలతో వారిలో ఏవిధంగా వెలుగులు నింపారో...అంతకంటే మెరుగైన పథకాలతో వైయస్ జగన్  వారి జీవనప్రమాణం పెంచుతారని పార్థసారధి అన్నారు. 
Back to Top