హోదాకు బాబే అడ్డంకి

హోదా ఉన్న రాష్ట్రాలు ఏం సాధించాయనడం దారుణం
రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు పెట్టారు
అక్రమ ప్రాజెక్టులను ఆపలేని అసమర్థ ప్రభుత్వం
మీకు చేతకాకపోతే మా పోరాటానికి మద్దతివ్వండి
బాబును చూసి మేఘాలు కూడా పారిపోయాయి
వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత పార్థసారధి

హైదరాబాద్‌: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా సీఎం చంద్రబాబే అడ్డుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత కొలుసు పార్థసారధి అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా ప్రత్యేక హోదా కావాలని, అది వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆకాంక్షిస్తుంటే..చంద్రబాబుకు ఇవేవి పట్టడం లేదన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబేనని, ఆయన మొట్ట మొదట లేఖ ఇవ్వడంతోనే కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. విభజన సమయంలో, ఎన్నికల వేళ ఆంధ్ర రాష్ట్రానికి ఐదేళ్ల ప్రత్యేక హోదా సరిపోదని, పరిశ్రమలు స్థాపించేందుకు రెండేళ్లు పడుతుందని, 15 ఏళ్లు కావాలని నాడు డిమాండ్‌ చేశారని గుర్తు చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక రెండేళ్ల పాటు ప్రజలను మభ్యపెడుతూ..ఇప్పుడు హోదా ఉన్న పది రాష్ట్రాలు ఏం సాధించాయని, ఆ రాష్ట్రాలు బాగా వెనుకబడి ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. 

ఇంతకు ముందు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదన్నారు..ఆ తర్వాత నీతి అయోగ్‌ అంగీకరించడం లేదని సాకులు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంట్, ప్రధాన మంత్రి, కేంద్ర కేబినేట్‌ బలమైన వ్యవస్థలన్నారు. పార్లమెంట్‌లో చట్టం చేసినా..నాడు ప్రధాని ఇచ్చిన హామీకే మోక్షం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే ప్రత్యేక హోదాకు చంద్రబాబే అడ్డుపడుతున్నారన్న అనుమానం కలుగుతుందన్నారు. ఇదే చంద్రబాబు 1947కు ముందు ఉంటే..బ్రిటీష్‌ వాళ్లు బాగా అభివృద్ధి చేస్తున్నారని, ఇక దేశానికి స్వాతంత్య్రం ఎందుకనేవారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. మనం ఈశాన్య రాష్ట్రాలతో పోటిపడుతున్నామా? మహారాష్ట్ర గుజరాత్‌లతో పోటి పడుతున్నామో చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు.

కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు
ఆంధ్ర ప్రదేశ్‌కు విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని పార్థసారధి ప్రశ్నించారు. సఖ్యతగా ఉండకపోతే పోలవరం నిర్మాణానికి, అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వదని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి ఉండవన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ దేశంలో అంతర్భాగమైనప్పుడు కేంద్రం ఎందుకు ఆదుకోదని నిలదీశారు. పోలవరం, అమరావతి, నీటి వాటా ఇవన్నీ కూడా ఆంధ్రుల హక్కు అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను బాబు కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని హామీల సాధనకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. అందరం కలిసి కేంద్రంపైన ఒత్తిడి తేద్దామని కోరారు.

మీకు చేతకాకపోతే..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి చేతకాకపోతే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపడుతున్న ఉద్యమాలకు అండగా నిలవాలని  పార్థసారధి సూచించారు.  చంద్రబాబు టీడీపీ అధినేతగా వ్యవహరిస్తున్నారే తప్ప..రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయడం లేదని విమర్శించారు. పాలనను మరిచి తన అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే సంక్షీర్ణ ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసేవారన్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి సీఎం ప్రధానిని అడగకపోవడం సిగ్గు చేటన్నారు.

మట్టి, ఇసుకతో పబ్బం
చంద్రబాబు పాలన మరిచి మట్టి, ఇసుక, పేడ అమ్మకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని  పార్థసారధి విమర్శించారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకోలేని అసమర్ధ ప్రభుత్వమని టీడీపీపై ధ్వజమెత్తారు. కృష్ణానది నుంచి మహెబూబ్‌నగర్‌లోనే 120 టీఎంసీల నీటిని కేసీఆర్‌ సర్కార్‌ తోడుకునే ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. చేతకాని ఇరిగేషన్‌ మంత్రి వల్లే కృష్ణా డెల్టా ఎడారిగా మారాయని మండిపడ్డారు.  తెలంగాణ ప్రాజెక్టులను ఆపకపోతే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

బాబును చూసి మబ్బులు కూడా పరార్
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి మేఘాలు, మబ్బులు పరారయ్యాయని కొలుసు పార్థసారిధి ఎద్దేవా చేశారు. ‘‘మనల్ని చూసి తుపాను భయపడి వెళ్లిపోయింది’’అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబును చూసి కరువు దగ్గరకు వస్తుందని ఆక్షేపించారు. సమీక్షలు, వీడియో కాన్ఫరెన్సులు తప్ప..క్షేత్రస్థాయిలో బాధితులను ఆదుకోవాలనే ఆలోచనే చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. లేదంటే టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని పార్థసారధి హెచ్చరించారు.

Back to Top