'పేదల బాగు కోసం వైయస్‌ఆర్‌సిపి కృషి'

బుట్టాయిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా) : పేదలు, రైతులు, బడుగు, బలహీన వర్గాల జీవితాలను బాగుచేయడమే ధ్యేయంగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌కృషి చేస్తోందని పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కూనపరెడ్డి రాఘవేంద్రరావు (చినబాబు) అన్నారు. బుట్టా‌యిగూడెం మండలంలో అచ్చియపాలెం టిడిపి నాయకుడు, సొసైటీ మాజీ అధ్యక్షుడు బొందల రెడ్డియ్య మంగళవారం వారి సమక్షంలో వైయస్‌ఆర్‌సిపిలో చేరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు, ప్రజల శ్రేయస్సు కోసం దివంగత సిఎం, మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి వివిధ పథకాలు రూపొందించి అమలు చేశారని చెప్పారు. 2004కు ముందు మన రాష్ట్రంలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేదన్నారు.

చంద్రబాబు పాలనలో సహకార రంగాన్ని నిర్వీర్యం చేశారని బాలరాజు, చెరుకువాడ, కూనపరెడ్డి ఆరోపించారు. ప్రస్తుత కిరణ్‌ ప్రభుత్వంలో కూడా రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. సహకార సంఘాల ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకుని వైయస్‌ఆర్‌సిపి బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైయస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డితోనే స్వర్ణయుగం సాధ్యమని పేర్కొన్నారు.
Back to Top